2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్.. తనని సెమీఫైనల్స్, ఫైనల్స్ టికెట్లు అడిగాడని టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ప్రపంచకప్ ఫైనల్ జరిగి శుక్రవారంతో పదేళ్లు పూర్తయిన సందర్భంగా భజ్జీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. అప్పుడు మొహాలీ వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ సెమీఫైనల్స్ మ్యాచ్‌కు ముందు అక్తర్ తనని సంప్రదించాడని చెప్పాడు.
"2011 వన్డే ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్‌తో సెమీఫైనల్స్‌కు ముందు అక్తర్ నన్ను కలిశాడు. తొలుత ఆ మ్యాచ్‌కు కొన్ని టికెట్లు కావాలని కోరాడు. దానికి నేను నాలుగు టికెట్లు ఇప్పించా. తర్వాత ఫైనల్స్‌కు కూడా టికెట్లు కావాలన్నాడు. దాంతో నేను ఇలా అన్నాను.. 'ఫైనల్స్ టికెట్లతో నువ్వేం చేస్తావు. అక్కడ ఆడేది టీమ్‌ఇండియా, పాకిస్థాన్ కాదు. ఒకవేళ నువ్వు వచ్చి వాంఖడేలో ఫైనల్స్ చూస్తానంటే 2-4 టికెట్లు ఇప్పించగలను' అని చెప్పాను. అయితే, పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లోనూ అక్తర్ ఆడకపోవడం గమనార్హం" అని హర్భజన్ నాటి విశేషాలను గుర్తు చేసుకున్నాడు.