దేశంలో ఇప్పటికీ చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలు, బలహీనతలను అంగీకరించడం లేదని టీమిండియా మాజీ సారథి ధోనీ అన్నాడు. క్రీడల్లో ప్రతి జట్టుకు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కోచ్ అవసరమని స్పష్టం చేశాడు. భారత మాజీ క్రికెటర్లు ఎస్.బద్రీనాథ్, శరవణ కుమార్ సంయుక్తంగా ఏర్పాటు ఎంఫోర్ స్వచ్ఛంద సంస్థ సమావేశంలో మాట్లాడుతూ ధోనీ, కోహ్లీ, అశ్విన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
'దేశంలో ఇప్పటికీ తమ మానసిక బలహీనతలను అంగీకరించని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మనలో చాలామంది వాటిని మానసిక ఆరోగ్య సమస్యలుగా భావిస్తాం. వీటిని ఎవరూ బయటకు చెప్పరు. నేను బ్యాటింగ్ చేసేందుకు వెళ్లి 5-10 బంతులు ఎదుర్కొనేంత వరకు నా గుండె వేగం అమాంతం పెరుగుతుంది. ఒత్తిడిగా అనిపిస్తుంది. కాస్త భయమూ వేస్తుంది. ఎందుకంటే అందరికీ ఇదే అనుభూతి ఉంటుంది. దాన్నెలా ఎదుర్కోవడం?' అని ధోనీ అన్నాడు.