భారత్తో జరుగబోయే టెస్టు సిరీస్లో విరాట్ కోహ్లీని ఎలా ఎదుర్కొవాలో తెలియడం లేదని.. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో ఇండియా చారిత్రక విజయానికి అందుబాటులో లేని కోహ్లీ.. ఈ సిరీస్లో మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని తెలిపాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్లో తొలి టెస్టు అనంతరం పితృత్వ సెలవులతో కోహ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే సిరీస్కు తిరిగి జట్టులోకి వచ్చాడు.
" కోహ్లీని ఎలా ఔట్ చేయాలి? అతడు అద్భుతమైన, ప్రపంచ స్థాయి ఆటగాడు. ఆసీస్తో చివరి మూడు టెస్టులకు పితృత్వ సెలవులకు వెళ్లిన అతడు కచ్చితంగా ఈ సిరీస్లో ఇంకా బాగా ఆడుతాడు. కోహ్లీని ఔట్ చేయడానికి కావాల్సిన బలహీనతలు నాకైతే కనిపించడం లేదు. కానీ మాకు మంచి బౌలింగ్ దళం ఉంది. అతనొక గొప్ప వ్యక్తి. నాకు మంచి స్నేహితుడు. మేము క్రికెట్ గురించి అతికొద్దిగా మాట్లాడుతాం. మరీ ఎక్కువగా కాదు"