ఈ ఏడాది ఐపీఎల్ నుంచి సురేశ్ రైనా తప్పుకోవడంపై సీఎస్కే ఫ్రాంచైజీ యజమాని ఎన్ శ్రీనివాసన్ స్పందించారు. రైనాను కోల్పోవడం పట్ల జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎటువంటి ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రైనా లీగ్ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలోనే 13 ఎడిషన్‌లో వైస్ కెప్టెన్ లేకుండానే సీఎస్కే ఆడనుంది. అయితే, ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదని ధోనీ తనకు భరోసా కల్పించినట్లు శ్రీనివాసన్ తెలిపారు.
"క్రికెటర్లు కూడా పాత తరం సినిమా హీరోల్లాగే తమ గురించి తాము గొప్పగా ఊహించుకుంటారు. చెన్నై టీమ్‌లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. ఎవరినీ నేను బలవంత పెట్టను.కొన్నిసార్లు విజయం తలకెక్కడం సహజం. నాకు ధోనీ రూపంలో బలమైన కెప్టెన్ ఉన్నాడు.నేను అతడితో మాట్లాడా. ఒకవేళ మరికొంత మంది వెళ్లినా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహీ హామీ ఇచ్చాడు. ఆటగాళ్లతో అతడు జూమ్ కాల్ ద్వారా మాట్లాడాడు. ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉండాలని కోరాడు."