దేశం ముందు క్రికెట్ చాలా చిన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఆట గురించి ఆలోచించట్లేదని టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అన్నాడు. అలాగే లాక్‌డౌన్ ప్రకటించే ముందు ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించాల్సిందన్నాడు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన భజ్జీ.. కరోనా పరిస్థితులపై స్పందించాడు.
"నిజంగా ఇప్పుడు నేను క్రికెట్ గురించి ఆలోచించట్లేదు. గత 15 రోజులుగా ఆ ధ్యాసేలేదు. దేశం ముందు ఆట చాలా చిన్నది. ఒకవేళ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేను క్రికెట్, ఐపీఎల్‌ల గురించి ఆలోచిస్తే స్వార్థపరుడినవుతా. సంపూర్ణ ఆరోగ్య భారతదేశమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం. మనమంతా ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటేనే క్రీడలు జరుగుతాయి. ఇప్పుడైతే క్రికెట్ నా ఆలోచనల్లో లేదు"
హర్భజన్ సింగ్, టీమిండియా సీనియర్ స్పిన్నర్
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా కలిసుండాలన్నాడు హర్భజన్. చేతనైనంత సాయం చేసి భారత దేశాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలని అన్నాడు. వలసకూలీల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించేముందే వారి గురించి ఆలోచించాల్సిందన్నాడు. వాళ్లకు ఉండడానికి వసతి, తినడానికి తిండి, సంపాదించడానికి ఉద్యోగం లేదని గుర్తుచేశాడు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని కోరాడు. ఇప్పుడు ఆ కూలీలకు స్వస్థలాలకు వెళ్లాలనిపిస్తోందని.. పరిస్థితులను చూస్తుంటే ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించాడు.
ఊహించని పరిస్థితులు
'ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని ఎవరూ ఊహించలేదు. నగరాలు, పట్టణాలు లాక్‌డౌన్ అవుతాయనుకోలేదు. చాలా త్వరగా పరిస్థితులు మారిపోయాయి. వలస కూలీల గురించి ఆలోచించే సమయమూ ప్రభుత్వానికి లేకపోయింది. ప్రజల భద్రత కోసం సరైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇంకా ఉందని ఆశిస్తున్నా. అందరూ ఇప్పుడెందుకు ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నారో అర్థమైంది. ఎందుకంటే వారికి తమ సన్నిహితులతో ఉండాలనిపిస్తోంది' అని హర్భజన్ చెప్పాడు.
ఇదీ చదవండి:ఇంట్లో ఉంటూనే మరోసారి మధుర స్మృతుల్లోకి