తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ బయోపిక్​లో హృతిక్.. కానీ ఒక్క షరతు

తన బయోపిక్​లో హృతిక్ రోషన్ నటిస్తే అభ్యంతరం లేదని, కానీ ఒక్క షరతు ఉందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. నటి నేహా ధూపియాతో జరిగిన ఇంటర్వ్యూలో పలు విషయాల్ని వెల్లడించాడు.

Hrithik Roshan in Sourav Ganguly biopic?
హృతిక్ రోషన్ సౌరభ్ గంగూలీ

By

Published : Sep 17, 2020, 4:15 PM IST

సచిన్‌ తెందుల్కర్‌, మహేంద్రసింగ్‌ ధోనీ, అజహరుద్దీన్‌లపై సినిమాలు వచ్చేశాయి. 1983 ప్రపంచకప్‌ నేపథ్యంలో కపిల్‌దేవ్‌ జీవితకథ ప్రధాన ఇతివృత్తంగా వెండితెరపైకి వచ్చేందుకు '83' సిద్ధంగా ఉంది. స్టార్ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌పై చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పుడు అభిమానులంతా ఆసక్తిగా ఓ క్రికెటర్‌ బయోపిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనే టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.

వెండితెరపై రికార్డులు కొల్లగొట్టగలిగే సరకు దాదా జీవితంలో కచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే అరంగేట్రం నుంచే ఇతడు తనదైన ముద్ర వేశాడు. రిజర్వు బెంచీపై ఉన్నప్పుడే మైదానంలో క్రికెటర్లకు శీతల పానీయాలు ఇవ్వనని నిరాకరించాడు. రొటేషన్‌ పద్ధతిలో వచ్చి లార్డ్స్‌లో శతకం బాదేశాడు. సచిన్‌తో కలిసి ఓపెనింగ్‌లో ఘనతలెన్నో సృష్టించాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చీకటిలో కూరుకుపోయిన భారత క్రికెట్‌కు వెలుగునిచ్చాడు. యువీ, కైఫ్‌, భజ్జీ, జహీర్‌, ధోనీ సహా చాలామంది యువకులను ప్రోత్సహించాడు. 2003లో జట్టును ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చాడు. ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌వాను టాస్‌ కోసం ఎదురుచూసేలా చేశాడు. 2001 కోల్‌కతాలో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. గ్రెగ్‌ ఛాపెల్‌తో వివాదం, మళ్లీ పునరాగమనం, రిటైర్‌మెంట్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు, బీసీసీఐ అధ్యక్షుడు.. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు అతడి కెరీర్‌లో ఉన్నాయి. వీటిపై అద్భుతమైన సినిమా వస్తుందనడంలో సందేహం లేదు.

జియో సావన్‌లో 'నోఫిల్టర్‌ నేహా' సీజన్‌5లో నేహా ధూపియాకు దాదా ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర సంగతులు చెప్పాడు. ఒకవేళ బయోపిక్‌ చేస్తే హీరోగా ఎవరిని ఎంచుకుంటారని నేహా ప్రశ్నించింది. 'ఎవరైతే బాగుంటుంది' అని దాదా ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు నేహా 'నేనైతే హృతిక్‌ రోషన్‌' అనుకుంటున్నానని చెప్పింది. అయితే 'అతడు తన దేహాన్ని మరి నాలా మార్చుకోవాలి' అని నవ్వుతూ చెప్పాడు దాదా. డ్రెస్సింగ్‌ రూమ్‌లో అంతగా డ్రెస్సింగ్‌ సెన్స్‌ లేనిది ఎవరికని ప్రశ్నించగా యువీ పేరు చెప్పాడు. క్రికెటర్లలో హీరో లక్షణాలు ఎవరికున్నాయని అడగ్గా మళ్లీ 'యువీ' పేరే అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2020 కోసం దాదా దుబాయ్‌లో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details