వచ్చే నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు ఆదివారం జట్టును ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. యువ ఆటగాళ్లకూ అవకాశం కల్పించింది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతోన్న మిడిలార్డర్ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు సెలక్టర్లు. అందుకోసం మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, పంత్‌లకు చోటు కల్పించారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే తొలిసారిగా భారత జట్టులో ముగ్గురు రాజస్థాన్ ఆటగాళ్లకు అవకాశం లభించింది.
రాజస్థాన్ నుంచి ముగ్గురు
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం ఎక్కువగా యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపారు సెలక్టర్లు. దేశవాళీ, ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన చేసిన క్రికెటర్లకు అవకాశం కల్పించారు. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టీమిండియాకు ఎంపికయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ క్రికెట్ ఆసోసియేషన్(ఆర్‌సీఏ)కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఖలీల్ అహ్మద్, దీపర్ చాహర్, రాహుల్ చాహల్‌లు చోటు దక్కించుకున్నారు.