టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతడు అడుగుపెడుతున్నాడంటే చాలు.. క్రికెట్ అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే, తను కేన్సర్ నుంచి కోలుకుని.. తిరిగి ఆటలో అడుగుపెట్టేందుకు లిటిల్ మాస్టర్ సచిన్ తెందూల్కర్ ఎంతో స్ఫూర్తి నింపినట్లు తెలిపాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు యువీ.
తన కెరీర్ చివర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు యువీ. ఆ తర్వాత జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చి.. మూడేళ్లకుపైగా జట్టులో కొనసాగాడు. అయితే, ఆ సమయంలో ఎన్నో హెచ్చుతగ్గులొచ్చాయని.. సచిన్ తనలో వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నింపినట్లు పేర్కొన్నాడు.
"నాకు కెరీర్లో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆ సమయంలో నేను సచిన్‌తో మాట్లాడేవాడిని. అతను ఒకసారి ఏమన్నాడంటే.. 'మనం ఎందుకు క్రికెట్ ఆడతాం?. అవును.. ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనుకుంటారు. కానీ ఏదైనా ప్రేమతో ఆడాలి. నేను నీ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తానో తెలియదు. అయితే, నువ్వు ఒకవేళ ఆటను నిజంగానే ఇష్టపడితే.. ఇప్పుడు కూడా మైదానంలో బ్యాట్ పట్టగలవు. అలాగే ఎప్పుడు రిటైర్ అవ్వాలో నువ్వే నిర్ణయించుకో. ఇంకొకరికి ఆ అవకాశం ఇవ్వకు.' అని సచిన్ చెప్పాడు."