కఠోర సాధన, ఉత్తమ ప్రణాళికలే ఆస్ట్రేలియా పర్యటనలో రహానెను విజయపథంలో నడిపిస్తున్నాయని అతడి కోచ్ ప్రవీణ్ అమ్రె తెలిపాడు. కరోనాతో వచ్చిన విరామంలో ఒక ప్రాక్టీస్ సెషన్‌కు బదులుగా రహానె రెండు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాడని అన్నాడు. జింక్స్.. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు తన వ్యూహాలతో కంగారూలను మట్టికరిపించాడని అభిప్రాయపడ్డాడు.
రహానె కోచ్ ప్రవీణ్ అమ్రె "అంతకుముందు సెషన్లు ప్లాన్ చేస్తూ ప్రాక్టీస్ నిర్వహించేవాళ్లం. కానీ కరోనా కారణంగా రహానె తనకు తానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. మునుపటి కంటే తీవ్రంగా సాధన చేశాడు. ఒక సెషన్‌కు బదులుగా రెండు సెషన్లు చెమటోడ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన దృష్టిలో ఉంచుకుని దోషరహితంగా ఆడేలా కఠోర సాధన చేశాడు. విజయం అనేది అంత సులవుగా రాదు. దాని కోసం శ్రమించాల్సిందే"
- ప్రవీణ్ అమ్రె, అజింక్య రహానె కోచ్
అయితే బ్యాటింగ్ మెరుగవ్వడంలో కోచ్‌గా తన పాత్ర ఉంటుందని, కానీ కెప్టెన్సీ వ్యూహాలన్నీ రహానెవే అని ప్రవీణ్ తెలిపాడు. "రహానె సారథిగా విజయవంతం అవుతున్నాడంటే అతడి స్వయంకృషితోనే. కోచ్‌గా బ్యాటింగ్ గురించి మాత్రమే చెప్పగలం. అయితే ప్రతికూలతల నడుమ అతడు జట్టుకు విజయాన్ని అందించడం అసాధారణ విషయం. రహానె గొప్పగా జట్టును నడిపిస్తున్నాడు. అతడి ప్రశాంతత, సంయమనమే అతడిని విజయపథంలో నడిపిస్తోంది. అంతేగాక యువక్రికెటర్లకు మద్దుతు ఇస్తూ, ఆట ప్రారంభమైన తొలి గంటలో అశ్విన్, బుమ్రా ప్రతిభను రహానె గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా ప్రణాళికలు అమలుపరిచాడు" అని పేర్కొన్నాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమంగా నిలిచాయి. సిడ్నీ వేదికగా జనవరి 7న మూడో టెస్టు ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి:కోహ్లీ, అనుష్కలకు కరోనా నెగటివ్