తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​ సిరీస్​లో గాయాలతో దూరమైన ఆటగాళ్లు వీరే - aus series team india injured players

ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఎంపిక నుంచి ఇప్పటివరకు వరుసగా భారత ఆటగాళ్లు గాయాల బారిన పడుతూనే ఉన్నారు. అయినా ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం తీసిపోకుండా దీటుగా ఆడుతూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. అయితే చివరి టెస్టుకు గాయంతో బుమ్రా కూడా దూరమవుతున్నాడు. దీంతో తుది జట్టు ఎంపికలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గాయపడిన ఆటగాళ్లు, రిజర్వ్‌ బెంచ్‌ ప్లేయర్ల వివరాలు చూద్దాం.

team india
టీమ్​ఇండియా

By

Published : Jan 12, 2021, 8:40 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రత్యర్థి జట్టు కన్నా టీమ్​ఇండియానే గాయాలతో తీవ్ర పోరాటం చేస్తోంది. ఇది కాస్త అతియోశక్తి అనిపించినా, కాదనలేని వాస్తవం! ఒకరా, ఇద్దరా.. జట్టు ఎంపిక నుంచి ఇప్పటివరకు 13 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అయినా కంగారూలకు భారత్‌ ముచ్చెమటలు పట్టించడం అభినందనీయం.

అయితే బ్రిస్బేన్‌ వేదికగా జరిగే ఆఖరి టెస్టుకు గాయంతో బుమ్రా కూడా దూరమవుతున్నాడని ప్రకటించడం వల్ల భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. తుదిజట్టును ఎలా ఎంపికచేయాలో తెలియక జట్టు యాజమాన్యం తల పట్టుకుంటోంది. రిజర్వ్‌ బెంచ్ బలంగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. కానీ సీనియర్లు లేని లోటుని జూనియర్లు భర్తీ చేయగలరా అనేది ప్రశ్న. అంతేగాక గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు ఎలా పోరాడుతుందనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో గాయపడిన ఆటగాళ్లు, రిజర్వ్‌ బెంచ్‌ ప్లేయర్ల వివరాలు చూద్దాం.

భువేనేశ్వర్‌ కుమార్‌

సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్ కుమార్‌ పిక్క కండరాల గాయంతో ఆస్ట్రేలియా పర్యటన ఎంపికకు అందుబాటులో లేడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భువీ గాయపడ్డాడు. దీంతో అతడు కోలుకోవడానికి జాతీయ క్రికెట్‌ అకాడమీకి (ఎన్‌సీఏ) చేరాడు. అయితే ఇప్పుడు గాయం నుంచి కోలుకున్న అతడు ముస్తాక్ అలీ టోర్నీలో ఉత్తరప్రదేశ్‌ తరఫున ఆడుతున్నాడు.

ఇషాంత్‌ శర్మ

సీనియర్‌ పేసర్‌ ఇషాంత్ శర్మ పక్కటెముకల గాయంతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే చివరి రెండు టెస్టులకు అయినా ఇషాంత్ అందుబాటులో ఉంటాడనుకున్నారు. కానీ ఆలస్యంగా కోలుకోవడం, ఆస్ట్రేలియా కఠిన క్వారంటైన్ నిబంధనలతో అతడు కంగారుల గడ్డకు పయనమవ్వలేదు.

వరుణ్‌ చక్రవర్తి

ఐపీఎల్‌లో సత్తాచాటిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ భుజం గాయంతో అతడు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

రోహిత్‌ శర్మ

తొడకండరాల గాయంతో టీమ్​ఇండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికవ్వలేదు. అయితే టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.

మహ్మద్ షమీ

అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా షమి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు చివరి మూడు టెస్టులకు దూరమై స్వదేశానికి వెళ్లాడు. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా అతడు అనుమానమే!

ఉమేశ్‌ యాదవ్‌

సీనియర్‌ పేసర్ ఉమేశ్‌ యాదవ్ రెండో టెస్టులో గాయపడ్డాడు. కాలి పిక్క పట్టేయడం వల్ల మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలియడం వల్ల స్వదేశానికి పయనమయ్యాడు. ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు.

కేఎల్ రాహుల్‌

ప్రాక్టీస్‌లో మణికట్టు బెణకడం వల్ల ఒక టెస్టు కూడా ఆడకుండానే కేఎల్ రాహుల్‌ స్వదేశానికి పయనమయ్యాడు. రాహుల్‌ గాయపడిన విషయాన్ని సిడ్నీ టెస్టుకు ముందు బీసీసీఐ తెలిపింది.

రవీంద్ర జడేజా

తొలి వన్డేలో తొడకండరాల గాయంతో ఇబ్బంది పడిన రవీంద్ర జడేజా త్వరగా కోలుకుని రెండో టెస్టు నుంచి జట్టుతో చేరాడు. కానీ సిడ్నీ టెస్టులో మరోసారి గాయపడ్డాడు. స్టార్క్‌ వేసిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్‌ టెస్టుకు కూడా అతడు దూరం కానున్నాడు.

రిషభ్‌ పంత్‌

సిడ్నీ టెస్టులో పంత్‌ మోచేతికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో వికెట్‌కీపింగ్‌ బాధ్యతల్ని సాహా నిర్వర్తించాడు. అయితే స్కానింగ్‌లో తీవ్రగాయాలు కాలేదని తెలియడం వల్ల పెయిన్ కిల్లర్‌ తీసుకుని పంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేశాడు. ఆఖరి టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు.

హనుమ విహారి

సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారి ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. గ్రేడ్-2 స్థాయిలో పిక్క గాయమైంది. దీంతో బ్రిస్బేన్‌ టెస్టుకు అందుబాటులో లేడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌

సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర నడుం నొప్పితోనే మూడో టెస్టు ఆడాడు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టుకు అనుమానమే అని భావిస్తున్నారంతా. అయితే ఫిజియో, వైద్యసాయంతో అశ్విన్ బ్రిస్బేన్‌ టెస్టు ఆడే అవకాశం ఉంది.

మయాంక్ అగర్వాల్‌

పేలవ ప్రదర్శనతోనే మయాంక్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడని భావించారు. కానీ ప్రాక్టీస్‌ సెషన్‌లో చేతికి గాయమవ్వడం వల్ల అతడిని స్కానింగ్‌కు తీసుకువెళ్లారు. కాగా, విహారి ఆఖరి టెస్టుకు దూరమవ్వడంతో నొప్పితోనే మయాంక్ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.

జస్ప్రీత్ బుమ్రా

ఇషాంత్, ఉమేశ్‌, షమి దూరమైనా యువపేసర్లతో బుమ్రా బౌలింగ్ దళాన్ని నడపించాడు. అయితే బుమ్రా కూడా ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. పొత్తి కడుపు నొప్పితో బ్రిస్బేన్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

వీళ్లతో పాటు పితృత్వ సెలవులపై కోహ్లీ కూడా చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. అయితే కీలక ఆటగాళ్లు దూరమైనా మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌తో పేస్‌ విభాగం బలంగానే ఉంది. కానీ అనుభవం లేని ఈ పేస్‌ దళం ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడిచేస్తారనేది ప్రశ్న. అయితే స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక వృద్ధిమాన్‌ సాహా, పృథ్వీ షాతో బ్యాటింగ్‌ రిజర్వ్‌ బెంచ్‌ ఫర్వాలేదనిపిస్తోంది. అయితే విహారి, జడేజా, బుమ్రా ఆఖరి టెస్టుకు దూరమవ్వడం వల్ల జట్టు కూర్పు ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. జనవరి 15న బ్రిస్బేన్‌ వేదికగా ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details