2010-11 సీజన్లో హైదరాబాద్ - రాజస్థాన్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. మొదట హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. దేశవాళీలో పెద్దగా అనుభవం లేని 18 ఏళ్ల కుర్రాడు బౌలింగ్. ఒక్క పరుగుకే ఓపెనర్ వికెట్ పడింది..కాసేపటికే మరొకటి.. ఇంతటితో ఆగలేదు.. బ్యాట్స్‌మెన్ వరుసగా అలా వచ్చి ఇలా పెవిలియన్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్.. 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా అప్రతిష్ఠ మూట గట్టుకుంది. అందులో 8 వికెట్లు ఆ కుర్రాడే తీశాడు. అతడే దీపక్ చాహర్. ఆదివారం.. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లోనూ 6 వికెట్లు తీసి, టీ20ల్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్.. భారత వాయుదళంలో పనిచేసి రిటైరయ్యారు. చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తితో దీపక్ ఎంతో కష్టపడేవాడని, నెట్స్‌లో లక్షసార్లుకు పైగా బౌలింగ్ చేసుంటాడని ఆయన చెప్పారు.
"మేమిద్దరం కన్న కల ఇప్పటికి తీరింది. ఈ స్థాయికి రావడం కోసం దీపక్ ఎంతో శ్రమించాడు. నెట్స్‌లో దాదాపు లక్షసార్లు పైగా బౌలింగ్ చేసుంటాడు" - లోకేంద్ర సింగ్, దీపక్ చాహర్ తండ్రి
ధోనీ పర్యవేక్షణలో రాటు తేలిన చాహర్
ఎప్పటి నుంచో దేశవాళీల్లో ఆడుతున్నప్పటికీ 2018 ఐపీఎల్ నుంచి వెలుగులోకి వచ్చాడు చాహర్. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు ఆ ఐపీఎల్లో పునరాగామనం చేసింది. బౌలర్ దీపక్ చాహర్‌ను పట్టుబట్టి ఎంపిక చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. పుణె తరఫున ప్రాతినిధ్యం వహించినపుడు చాహర్ బౌలింగ్ నచ్చి, ధోనీ అతడిని చెన్నై జట్టులోకి తీసుకున్నాడు.
తన మీద ధోనీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చాహర్. గత సీజన్లో 10 వికెట్లు తీయగా.. ఈ ఏడాది అతడు 22 వికెట్లతో దూసుకెళ్లాడు. స్వింగ్ బౌలరైన దీపక్.. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని అన్ని రకాల బంతులు సంధించాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున కీలక బౌలర్ అవుతానడంలో సందేహం లేదు.