స్వదేశంలో టీమిండియా చేతిలో టెస్టు సిరీస్ ఓడిపోవడం.. తన కోచింగ్ కెరీర్‌కు మేలుకొలుపు లాంటిదని అన్నాడు ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్. తన కెరీర్లోనే ఇదో కీలక ఘట్టమని చెప్పాడు. 2018-19లో జరిగిన ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కోహ్లీసేన సొంతం చేసుకుంది. ఈ ఓటమిపై తాజాగా స్పందించిన లాంగర్.. తన అనుభవాలను పంచుకున్నాడు.
"భారత్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమి.. నా కోచింగ్ కెరీర్‌కు మలుపు. మరో పదేళ్ల తర్వాత జీవితాన్ని చూసుకుంటే ఈ సంఘటన గుర్తుండిపోతుంది. 2001లోనూ నన్ను జట్టు నుంచి తప్పించారు. 31 ఏళ్ల వయసులో ఇక నా పని అయిపోయిందనుకున్నా. కానీ నన్ను ఈ క్లిష్ట పరిస్థితులే జీవితంలో ఓ వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎలా నిలదొక్కుకోవాలో నేర్పించాయి. జీవితంలో ఇలాంటి పరిస్థితుల వల్ల అద్భుతమైన వ్యక్తిగా మారేందుకు అవకాశం లభిస్తుంది"