మాజీ క్రికెటర్లు, క్రికెట్ సంఘాలు ఈ ఏడాదితో పాటు దశాబ్దంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రికెట్ జట్లను ఎంపిక చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎలిస్ పెర్రీ, డేల్ స్టెయిన్, స్టీవ్ స్మిత్‌ను ఈ దశాబ్దపు క్రికెటర్లుగా ఎంపిక చేసింది విజ్డెన్ సంస్థ. తాజాగా ఐపీఎల్ దశాబ్దపు జట్టునూ ప్రకటించింది. దానికి సారథిగా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. లీగ్ నిబంధనలను అనుసరించి నలుగురు విదేశీయులు, ఏడుగురు స్వదేశీయులకు జట్టులో చోటిచ్చింది.
ఇద్దరూ ఇద్దరే....
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ. ముంబయిని హిట్‌మ్యాన్ నాలుగుసార్లు విజేతగా నిలపగా... చెన్నైకి మహీ మూడు సార్లు టైటిల్ అందించాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిగా ఎంపిక చేయాలో కష్టమే. అయితే దశాబ్ద కాలంపాటు ఒకే జట్టుకు సారథిగా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీకి... ఈ జాబితాలో కెప్టెన్‌గా చోటు దక్కలేదు. అతడికి బ్యాట్స్‌మన్/కీపర్‌గా స్థానమిచ్చింది విజ్డెన్.
దీనికి కారణం తక్కువ కాలంలో ఎక్కువ విజయాల ఆధారంగా రోహిత్‌కే విజ్డెన్ నాయకత్వం అప్పగించింది. రోహిత్‌తో ఓపెనర్‌గా క్వింటన్ డికాక్‌ను తీసుకుంది. కీలకమైన మూడో స్థానంలో సురేశ్ రైనాను ఎంపిక చేసింది. ఎందుకంటే చెన్నై తరఫున ఆ స్థానంలో రైనా పరుగుల వరద పారించాడు.
నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది విజ్డెన్. ఐదో స్థానానికి ఎంఎస్ ధోనీని తీసుకుంది. మహీకే వికెట్‌కీపర్ బాధ్యతలు అప్పగించింది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ చోటు దక్కించుకున్నారు. భువనేశ్వర్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ పేసర్లుగా ఎంపికయ్యారు. 12వ ఆటగాడిగా డ్వేన్ బ్రావోను తీసుకుంది. మొత్తంగా విజ్డెన్ ఐపీఎల్ జట్టులో ముంబయి నుంచి నలుగురు, చెన్నై నుంచి ముగ్గురు ఎంపికయ్యారు.
విజ్డెన్ ఐపీఎల్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ (కీపర్), రవీంద్ర జడేజా, సునిల్ నరైన్, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, డ్వేన్ బ్రావో.