తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంతర్జాతీయ మ్యాచ్​లో తాగొచ్చి బౌలర్లను ఉతికేశాడు - Gibbs 175 runs

ఒక బ్యాట్స్‌మన్‌ వీర లెవెల్లో హిట్టింగ్‌ చేస్తే ఆ ఇన్నింగ్స్‌ చూసి దిమ్మతిరిగిపోయిందని అంటాం! కానీ ఓ బ్యాట్స్‌మన్‌కు నిజంగానే దిమ్మతిరిగిపోతుండగా ఆడిన ఇన్నింగ్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా! ముందు రోజు రాత్రి పరిమితికి మించి తాగిన మద్యం తాలూకు మత్తు ఊపేస్తుండగా.. ఆ హ్యాంగోవర్‌ను వదిలించుకోవడానికే ఓ ఆటగాడు పూనకం వచ్చిన వాడిలా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక పెను విధ్వంసాన్ని సృష్టించగా.. ఆ ఇన్నింగ్స్​ ప్రపంచ క్రికెట్​నే ఆశ్చర్యానికి గురిచేసింది. కనీ వినీ ఎరుగని రికార్డుకు కారణమైంది. ఆ 'హ్యాంగోవర్‌' హిట్టింగ్​‌ కథాకమామిషేంటో తెలుసుకుందాం పదండి..

Herschelle Gibbs Scored 175 Runs
అంతర్జాతీయ మ్యాచ్​లో తాగొచ్చి బౌలర్లను చితకేశాడు!

By

Published : Jun 3, 2020, 6:31 AM IST

అది 2006.. వన్డేల్లో 300 పైచిలుకు లక్ష్యాలంటే సవాలుగా చూసే రోజులవి. అప్పటికి అత్యధిక ఛేదన 332. అలాంటిది ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు ఏకంగా 434 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ ఆరంభించకముందే ఫలితంపై అంతా ఓ అంచనాకు వచ్చేశారు. ఇక ఆ జట్టు ఏమేర పోరాడుతుంది, ఎంత తేడాతో ఓడుతుంది అన్న దానిపైనే అందరి ఆసక్తి! కానీ మూడున్నర గంటల తర్వాత జరిగింది చూసి క్రికెట్‌ ప్రపంచం విస్తుబోయింది. ఆ జట్టు 435 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి పడేసింది. ఆ అద్భుతానికి కర్త.. హెర్ష్‌లె గిబ్స్‌!

హెర్ష్‌లె గిబ్స్

సొంతగడ్డపై 2006లో ఆస్ట్రేలియాతో అయిదు వన్డేల సిరీస్‌లో తలపడింది దక్షిణాఫ్రికా. సిరీస్‌ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక చివరి వన్డేకు జొహనెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ మైదానం సిద్ధమైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. పాంటింగ్‌ (164) మెరుపు శతకం సాయంతో 4 వికెట్లకు 434 పరుగులు చేసింది. అప్పటికి వన్డేల్లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు అదే. కానీ ఆ రికార్డు కొన్ని గంటల్లోనే బద్దలైపోవడమే అనూహ్యం!

మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి సుమారు ఒంటి గంట వరకూ మద్యం తాగుతూనే ఉన్న గిబ్స్‌.. ఉదయం హ్యాంగోవర్‌తోనే మైదానంలో అడుగుపెట్టాడు. తల తిరుగుతుండగానే ఫీల్డింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌ చేస్తున్నపుడూ ప్రభావం కొనసాగింది. ఈ విషయాన్ని ఆత్మకథలో అతనే వెల్లడించాడు. కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో దక్షిణాఫ్రికా రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ కోల్పోయింది. నోట్లో ఇంకా మద్యం రుచి అలాగే ఉండగానే గిబ్స్‌ క్రీజులోకి వచ్చాడు. తడబడుతూనే బ్యాటింగ్‌ మొదలెట్టాడు. తొలి 14 బంతుల్లో 13 పరుగులే చేశాడు. క్రీజులో కుదురుకున్నా మరీ వేగంగా ఆడలేకపోయాడు. 46 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఇలా ఆడితే లాభం లేదనుకున్నాడేమో ఇక దంచడం మొదలెట్టాడు. బాదడమే పనిగా పెట్టుకున్న అతను బంతి పడడమే ఆలస్యం దాన్ని బౌండరీలు దాటించాడు. పుల్‌ షాట్‌తో స్క్వేర్‌లెగ్‌ దిశగా సిక్సర్‌ బాది తన జోరు పెంచిన అతను.. షార్ట్‌ డెలివరీని నటరాజు పోజులో బౌండరీకి తరలించాడు. స్పిన్నర్‌, పేసర్‌ అనే తేడా లేదు.. అందరికీ ఒకే రకమైన శిక్ష.. అతని బ్యాట్‌ మంత్రదండంలా కదులుతూ మాయ చేసింది. స్టేడియంలోని ప్రేక్షకుల కేరింతలతో హోరెత్తిస్తుంటే గిబ్స్‌ శివాలెత్తాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 79 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. తర్వాత దూకుడు మరింత పెంచాడు. చూస్తుండగానే స్కోరు పెరుగుతూ పోయింది. లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఆసీస్‌ బౌలర్లలో దడ మొదలైంది. 130 పరుగుల వద్ద అతని క్యాచ్‌ను వదిలేసిన ఆసీస్‌ దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. శతకం నుంచి 150 పరుగులకు చేరుకోవడానికి అతను కేవలం 21 బంతులే తీసుకోవడం గమనార్హం!

30 ఓవర్లకు జట్టు స్కోరు 279/2తో లక్ష్యం దిశగా సాగింది. ఆ తర్వాత రెండో ఓవర్లో గిబ్స్‌ క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. గిబ్స్‌ పోరాటాన్ని వృథా చేయకుండా బౌచర్‌ అజేయ అర్థశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. భారీ ఛేదనలో ఉండే ఒత్తిడిని తట్టుకుని గిబ్స్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ వన్డే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచిపోయింది. 111 బంతులు.. 175 పరుగులు.. 21 ఫోర్లు, 7 సిక్సర్లు.. ఈ గణాంకాలే చెప్పేస్తాయి గిబ్స్‌ ఎంత విధ్వంసకరంగా ఆడాడో!

ఇలాంటి మరపురాని ఇన్నింగ్స్​ ఆడిన అపురూప బ్యాట్​ను ఓ మంచి పని కోసం ఇటీవలె వేలానికి పెట్టాడు గిబ్స్​. దక్షిణాఫ్రికాలోని కరోనా బాధిత కుటుంబాలకు విరాళాలు సేకరించేందుకు ఈ బ్యాట్​ను అమ్మకానికి పెట్టినట్లు అతడే స్వయంగా వెల్లడించాడు.

ఇదీ చూడండి: ప్రపంచకప్​లో విధ్వంసకర ఇన్నింగ్స్​.. కపిల్ 175 నాటౌట్​

ABOUT THE AUTHOR

...view details