తెలంగాణ

telangana

ETV Bharat / sports

చాహర్​​ దెబ్బకు బంగ్లా హడల్​.. భారత్​దే సిరీస్​ - nagpur t20 match

బంగ్లాతో జరిగిన మూడు టీ20ల సిరీస్​ను 2-1 తేడాతో నెగ్గింది టీమిండియా. నాగ్​పూర్​ వేదికగా జరిగిన మూడో టీ20లో 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. 6 వికెట్లు తీసి విజృంభిచాడు టీమిండియా బౌలర్ దీపక్ చాహర్. ఇందులో ఒక హ్యాట్రిక్​ ఉంది. ఈ గణాంకాలతో సరికొత్త రికార్డు సృష్టించాడు చాహర్​.

బంగ్లాదేశ్​పై టీమిండియా గెలుపు

By

Published : Nov 10, 2019, 11:10 PM IST

Updated : Nov 10, 2019, 11:17 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన మూడో టీ20 భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాగ్​పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో నెగ్గి 2-1 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 6 వికెట్లతో విజృంభించి బంగ్లా ఓటమిలో కీలక పాత్ర పోషించగా.. శివమ్ దూబే మూడు వికెట్లు తీశాడు.

ఆరు వికెట్లతో అదరగొట్టిన చాహర్..

టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ 3.2 ఓవర్లు బౌలింగ్ చేసి.. 7 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. లిటన్ దాస్​(9)తో మొదలు పెట్టి.. సౌమ్యా సర్కార్(0), మహ్మద్ మిథున్(27), అమినుల్ ఇస్లాం(9), షైఫుల్​ ఇస్లాం(4), ముస్తాఫిజుర్ రెహమాన్(1) వికెట్లు తీసి అదరగొట్టాడు చాహర్.

175 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన బంగ్లాదేశ్..​ ఆరంభంలో ఓపెనర్ లిట్టన్ దాస్ వికెట్ కోల్పోయింది. మరుసటి బంతికే సౌమ్యా సర్కార్​నూ ఔట్ చేసి బంగ్లాను మరింత దెబ్బతీశాడు దీపక్ చాహర్. అప్పటికీ జట్టు స్కోరు 12 పరుగులే. మరో ఓపెనర్ మహ్మద్ నయీమ్.. మిథున్​తో కలిసి ఇన్నింగ్స్​ను గాడీలో పెట్టేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

హ్యాట్రిక్​.. రికార్డులు...

  • బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన దీపక్‌ చాహర్‌
  • టీ20ల్లో అత‌్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన దీపక్‌ చాహర్‌
  • 3.2ఓవర్లలో7పరుగులు ఇచ్చి6వికెట్లు తీసిన దీపక్ చాహర్‌
  • అజంతా మెండిస్‌ పేరిట ఉన్న రికార్డు ‍(6/8‌)తిరగరాసిన చాహర్‌

నయీమ్ అర్ధశతకం...

ఓపెనర్​ నయీమ్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో 81 పరుగులు చేసి ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఓ దశలో బంగ్లాదేశ్​ను విజయం దిశగా తీసుకెళ్లాడు. అయితే దూబే అతడి దూకుడుకు అడ్డుకట్టవేసి పెవిలియన్​కు పంపాడు.

బౌలర్ శివమ్ దూబేతో కెప్టెన్ రోహిత్ శర్మ

2 వికెట్ల నష్టానికి 110 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న బంగ్లాదేశ్​ను.. మిథున్​ను ఔట్​ చేసి మరోసారి దెబ్బతీశాడు దీపక్. కాసేపటికే దూబే ముష్ఫీకర్ రహీమ్​ను బౌల్డ్ చేశాడు. 16వ ఓవర్లో వెంటవెంటనే నయీమ్​, ఆఫిఫ్ హొస్సేన్​ను(0) పెవిలియన్ పంపించి మరోసారి బంగ్లాను దెబ్బతీశాడు. నయీమ్ ఔట్​తో భారత్ విజయం ఖరారైంది. పదే పదే వికెట్లు కోల్పోతూ బంగ్లా.. చివర్లో చేతులెత్తేసింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో శ్రేయస్ అయ్యర్(62), కేఎల్ రాహుల్(52) అర్ధశతకాలతో అదరగొట్టారు. బంగ్లా బౌలర్లలో షైఫుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ చెరో రెండు వికెట్లు తీశారు. అల్ అమిన్​కు ఓ వికెట్ దక్కింది.

Last Updated : Nov 10, 2019, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details