దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ పాకిస్థాన్ విజయం సాధించింది. రావల్పిండిలో జరిగిన ఈ మ్యాచులో 370 పరుగుల ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. 274 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా 95 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న పాకిస్థాన్.. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంలో బౌలర్ హసన్ అలీ(10వికెట్లు) కీలక పాత్ర పోషించాడు. సఫారీ జట్టుపై పాక్ సిరీస్ గెలవడం 18 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ఫిబ్రవరి 11(గురువారం) నుంచి ప్రారంభంకానుంది.
తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 272 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 201 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న పాక్‌కు రిజ్వాన్ (115) శతకం తోడవ్వడం వల్ల మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులు లభించాయి. ఫలితంగా 370 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. ఛేదనలో ఓపెనర్ మర్‌క్రమ్ (108) సెంచరీ బాదినా.. అతడికి జట్టు నుంచి సహకారం కరవైంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ తెంబ బవుమా (61), రస్సీ వన్ దర్ దస్సెన్(48) పర్వాలేదనిపించారు. మిగతా వారు తేలిపోయారు. మొత్తంగా సఫారీ జట్టు 274 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా.. తొలి ఇన్నింగ్స్‌లోనూ అతనికి ఐదు వికెట్లు దక్కాయి. కెరీర్‌లో 10 వికెట్ల మార్క్‌ను అతడు అందుకోవడం ఇదే తొలిసారి.