అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తించానని టీమ్‌ఇండియా, ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. తాను ప్రశాంతంగా ఉండేందుకు కుటుంబ సభ్యులే కారణమని కితాబిచ్చాడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోదరుడు కృనాల్‌తో కలిసి అతడు మాట్లాడాడు.
ఆ విషయంలో నా కుటుంబానిది కీలకపాత్ర: హార్దిక్ - క్రికెట్ న్యూస్
టీమ్ఇండియాకు ఆడుతున్నప్పుడు మానసిక ఆరోగ్యం విషయంలో తన కుటుంబానిది ప్రధాన పాత్ర అని హార్దిక్ పాండ్య చెప్పాడు. చిన్న చిన్న విషయాలు చూసుకుంటే దేహం ఫిట్‌గా ఉంటుందని అన్నాడు.
'అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు మన జీవితాల్లోకి ఎంత ఒత్తిడి వస్తుందో మానసికంగా నేను గ్రహించాను. జీవితం కచ్చితంగా మారుతుంది. కానీ వ్యక్తిగతంగా అన్నింటినీ ఆకళింపు చేసుకోవడం అవసరం. నా మానసిక ఆరోగ్యం బాగుండటంలో కుటుంబానిదే కీలక పాత్ర' అని హార్దిక్ చెప్పాడు. 'రోజూ కాసేపు కసరత్తులు చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. దాంతో మనం మరింత ఫిట్‌గా మారతాం. చిన్నచిన్న విషయాలను చూసుకుంటే మన దేహం ఎంతో గొప్పగా ఉంటుంది' అని అతడు వివరించాడు.
మనిషికి ఆత్మ సంతృప్తి, మానసిక ప్రశాంతత అత్యంత అవసరమని హార్దిక్ సోదరుడు కృనాల్ చెప్పాడు. 'మనం బాగా కష్టపడుతున్నప్పుడు ఆత్మ సంతృప్తి కోసమూ శ్రమించాలి. ప్రశాంతంగా ఉంటేనే ఎనిమిది గంటలు సుఖంగా నిద్రించగలం. నాలుగైదు గంటలు నవ్వుకోగలం' అని అన్నాడు. 'బాల్యంలో ఆడటం మొదలు పెట్టినప్పటి నుంచే శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో గ్రహించా' అని యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ తెలిపాడు. 'సరైన పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. సరైన ఆహారపు అలవాట్లను కొనసాగించడం అత్యంత ప్రయోజకరం' అని అనుకుల్‌రాయ్ పేర్కొన్నాడు.