టెస్టు క్రికెట్‌లో సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాను టీమ్‌ఇండియా కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓ క్రీడా ఛానెల్లో మాజీ బ్యాట్స్‌మన్ ఆకాశ్‌చోప్రాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన బెంగాల్ కీపర్.. తర్వాత రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ చెలరేగడం వల్ల జట్టులో సాహా చోటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై సంభాషించిన భజ్జీ, చోప్రా ఏమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. పంత్‌కు తోడుగా రెండో కీపర్‌గా టీమ్‌ఇండియా సాహాను కొనసాగించాలా లేక యువ వికెట్‌కీపర్ వైపు మొగ్గుచూపాలా? అని చోప్రా.. హర్భజన్‌ను అడిగాడు.
"ఇది చాలా కష్టమైన ప్రశ్న. కానీ, ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే కచ్చితంగా సాహానే ఎంచుకుంటాను. అతడు జట్టుతో కలిసి చాలా కాలంగా ఆడుతున్నాడు. అతడో అత్యుత్తమ కీపర్ కూడా. మరోవైపు పంత్ బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడు. అతడు ఆడేకొద్దీ మరింత నైపుణ్యం సాధిస్తాడు. సాహాను కొంతకాలం జట్టుతో కొనసాగించాలి. అతడి వయసు 35 ఏళ్లు దాటిందని తెలుసు. కానీ, చాలా మంది యువకుల కన్నా అతడే అత్యుత్తమం. అలాగే టీమ్‌ఇండియాకు కలిసి వచ్చే విషయం ఏమిటంటే.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు కూడా కీపింగ్ స్థానం కోసం సిద్ధంగా ఉన్నారు."