తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ ఆడేందుకు అభ్యంతరం లేదు' - బీసీసీఐ ఐపీఎల్

ఐపీఎల్​తో చాలా మంది జీవితాలు ఆధారపడ్డాయని అన్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్. పరిస్థితులు కుదుటపడిన తర్వాతే టోర్నీ జరపాలని అభిప్రాయపడ్డాడు.

Harbhajan singh
హర్భజన్ సింగ్

By

Published : Apr 7, 2020, 2:58 PM IST

కరోనా వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితులు అదుపులోకి వచ్చాకే ఐపీఎల్‌ నిర్వహించాలని భారత సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ వైరస్‌ వల్లే గత నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌.. ఈనెల 15కు వాయిదా పడింది. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అయితే 15వ తేదీ తర్వాత టోర్నీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భజ్జీ.. ఐపీఎల్ గురించి మాట్లాడాడు.

'క్రికెట్‌కు వీక్షకులు ఎంతో ముఖ్యం, ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఖాళీ మైదానాల్లో ఆడడానికైనా ఎలాంటి అభ్యంతరం లేదు. అదే జరిగితే ఓ ఆటగాడిగా నాకు ఉత్సాహం లభించదు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ తప్పకుండా టీవీల్లో వీక్షించే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆటగాళ్ల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదెంతో ముఖ్యం. ఈ ఈవెంట్‌తో అనేక మంది జీవితాలు ఆధారపడ్డాయి. పరిస్థితులన్నీ చక్కబడ్డాకే ఐపీఎల్‌ను నిర్వహించాలి' -హర్భజన్‌ సింగ్, భారత సీనియర్ బౌలర్

ఇప్పుడు తాను మ్యాచ్‌లు ఆడలేకపోతున్నానని, ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు (ఫైనల్‌తో కలిపి) ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం మైదానాన్ని సందర్శించే అవకాశం కోల్పోతున్నానని అన్నాడు. అభిమానులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, తమ బస్సు వెంట చేసే బైక్‌ ర్యాలీలు చూడలేకపోతున్నానని బాధపడ్డాడు. అభిమానులూ ఇలాగే ఫీలవుతుంటారని అభిప్రాయపడ్డాడు. త్వరలోనే ఐపీఎల్‌ జరగాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటిదాకా ఫిట్‌నెస్‌ కాపాడుకుంటానన్నాడు.

చెన్నై సూపర్​కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్

మరోవైపు ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయ ఏర్పట్లనూ పరిశీలించే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో నిర్వహించడం సాధ్యం కాకపోతే అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిపేందుకు అవకాశం లేకపోలేదు.

ABOUT THE AUTHOR

...view details