టీమిండియా క్రికెట్లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు సురేశ్ రైనా. ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లతో అభిమానుల్ని అలరించాడు. ఈ క్రికెటర్.. జాతీయ జట్టుకు దూరమై చాలా కాలమైంది. ఎప్పటికైనా పునరాగమనం చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో రైనా మెరుపుల్ని చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆటగాడి పుట్టినరోజు సందర్భంగా అతడి క్రికెట్ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.
మొదటి మ్యాచ్‌లోనే డకౌట్
2005 జులై 30న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రైనా.. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కానీ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చాడు. అనంతరం టెస్టు ఎంట్రీ లంకపైనే చేసి సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సుస్థిర స్థానం సంపాదించాడు. కెరీర్ మొత్తంగా టెస్టుల్లో 768, వన్డేల్లో 5,615, టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు.
మొదటి ప్రశంసలు రైనా నుంచే
భారత్ క్రికెట్ జట్టులో బౌలర్ వికెట్ తీసినా, ఫీల్డర్ క్యాచ్ పట్టినా, రనౌట్ చేసినా మొదటి ప్రశంస వచ్చేది రైనా నుంచే. వికెట్ పడిన సమయంలో రైనా మైదానంలో ఉంటే పరిస్థితి వేరేలా ఉంటుందని చాలాసార్లు నిరూపితం చేశాడు. 2015 ప్రపంచకప్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 99 పరుగుల వద్ద సింగిల్ తీశాడు. అవతలి ఎండ్‌లో రైనా ఉన్నాడు. కోహ్లీ పరుగు పూర్తి కాకముందే రైనా అతడి కంటే ముందు అభివాదం చేస్తూ ఉత్సాహంతో వచ్చాడు. అప్పుడు కెమెరాలన్నీ రైనా వైపు మళ్లాయి. అంటే విరాట్ కంటే ముందే అతడి సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు రైనా.
జట్టుపై అమితమైన ప్రేమ
టీమిండియాలో రైనాకు సుస్థిరమైన బ్యాటింగ్ స్థానం లేదనే చెప్పాలి. అతడి కెరీర్లో టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్లో ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా చేసేవాడు. ప్రస్తుతం జట్టుకు దూరమైనా.. టీమ్ గెలిచిందంటే సామాజిక మాధ్యమాల వేదికగా తప్పకుండా ప్రశంసిస్తాడు.