తెలంగాణ

telangana

ETV Bharat / sports

శతకంతో ఆదుకున్న విహారీ.. భారత్ 263 ఆలౌట్ - Hanuma Vihari century

టెస్టు సిరీస్​ ముంగిట న్యూజిలాండ్​ ఎలెవన్​తో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో భారత ఆటగాళ్లు నిరాశపర్చారు. తొలి ఇన్నింగ్స్​లో 78.5 ఓవర్లు ఆడి 263 పరుగులకు ఆలౌటైంది టీమిండియా. నలుగురు డకౌట్​ కాగా, మరో నలుగురు సింగిల్​ డిజిట్​ స్కోరుకే పరిమితమయ్యారు. పుజారా, ఆంధ్రా కుర్రాడు విహారి మాత్రమే రాణించారు.

విహారీ
విహారీ

By

Published : Feb 14, 2020, 5:38 PM IST

Updated : Mar 1, 2020, 8:32 AM IST

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆడుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నిరాశపర్చారు. ఓపెనర్ల పరీక్షలో పృథ్వీ షా(0), మయాంక్‌ అగర్వాల్‌(1) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో దిగిన శుభ్​మన్‌ గిల్‌(0) కూడా డకౌట్​ అయ్యాడు. ఫలితంగా వీరిలో ఎవరిని తుది జట్టులో ఓపెనర్లుగా దించాలన్నది సందిగ్ధంగా మారింది.

ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన ఛెతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 93 పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. అజింక్యా రహానే(18) వైఫల్యం చెందినా.. ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివరికి శతకం తర్వాత 101 వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. రిషభ్‌ పంత్‌(7) సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా.. సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు డకౌట్‌ అయ్యారు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 10 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. విరాట్​ కోహ్లీ బ్యాటింగ్​కు దిగలేదు. స్కాట్​ కగ్లిజెన్​, ఇష్​ సోథీ తలో 3 వికెట్లు సాధించారు. గిబ్సన్​ 2, నీషమ్​ ఒక వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

మ్యాచ్‌ అనంతరం విహారి మాట్లాడుతూ జట్టు ఏ స్థానంలో ఆడమంటే అక్కడ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కొన్ని సార్లు జట్టు పరిస్థితులను అర్థం చేసుకోవాలని, అందుకు నిరాశ చెందకూడదని తెలిపాడు. ఈ ఉదయం పిచ్‌ మందకొడిగా ఉందని, తర్వాత కుదురుకున్నాక పుజారాతో కలిసి వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు నిర్ణయించుకున్నామని విహారి వివరించాడు.

Last Updated : Mar 1, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details