ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4) ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రెండో ఇన్నింగ్స్ సందర్భంగా విహారి 112 బంతుల్లో కేవలం 7 పరుగులే చేశాడు. దీంతో అప్పటికి అతడి స్ట్రైక్‌రేట్ 6.25గా నమోదైంది. అంతకుముందు 1980/81 సీజన్‌లో యశ్పాల్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపైనే 157 బంతుల్లో 13 పరుగులే చేశాడు. ఆ మ్యాచ్‌లో యశ్పాల్ కూడా 112 బంతులాడాక 7 పరుగులే చేయడం గమనార్హం. దీంతో 40 ఏళ్ల తర్వాత విహారి ఆ అరుదైన రికార్డును అందుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సోమవారం 407 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కొనసాగించగా ఆదిలోనే రహానె(4) వికెట్ కోల్పోయింది. అనంతరం పంత్(97), పుజారా(77) కీలక ఇన్నింగ్స్ ఆడి టీమ్‌ఇండియా విజయంపై ఆశలు రేకెత్తించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ నాలుగో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. అయితే, శతకానికి చేరువైన పంత్.. లియోన్ బౌలింగ్‌లో కమిన్స్ చేతికి చిక్కగా.. కొద్దిసేపటికే పుజారా కూడా హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో స్వల్ప వ్యవధిలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత అశ్విన్(39*; 128 బంతుల్లో 7x4)తో జోడీ కట్టిన విహారి పూర్తిగా డిఫెన్స్ ఆడాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.