అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో అవినీతి పేరుకుపోయిందని ఆ జట్టు మాజీ సారథి గుల్బాదిన్ నైబ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డులో జరుగుతున్న అనేక అక్రమాలను బహిరంగంగా వెల్లడిస్తానని అన్నాడు. ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేసిన గుల్బాదిన్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు క్రికెటర్లతో పాటు బోర్డు సభ్యులు, ప్రభుత్వ అధికారులను ప్రత్యక్షంగా బెదిరించాడు. మరోవైపు ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ తాను కెప్టెన్‌గా ఉండటం వల్ల, కొందరు ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఆడలేదని అన్నాడు.
'అఫ్గాన్ క్రికెట్‌లో అవినీతి.. అందరి పేర్లు బయటపెడతా' - afghanistan cricket
అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని అన్నాడు క్రికెటర్ గుల్బాదిన్ నైబ్. త్వరలో వారందరి పేర్లు బయటపెడతానని వరుస ట్వీట్స్ చేశాడు.
"నా ప్రియమైన ప్రజలారా, నేను మీముందుకు రావడానికి గల కారణం.. నాకు ఎవరి మీదా వ్యక్తిగత పగ లేకపోవడమే. దేశ ప్రజలను మోసం చేస్తూ జాతీయ క్రికెట్‌లో అవినీతిపరులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి పేరు బహిర్గతం చేస్తా. ఈ విషయాలను ముందే ఎందుకు చెప్పలేదని చాలా మంది నన్ను అడగొచ్చు. అయితే కొందరు అధికారులు, బోర్డు సభ్యులు ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పి నా నోరు మూయించారు. అలాగే క్రికెట్ బోర్డుపై పెత్తనం చెలాయించే కొందరు ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోయారు. ఇంకో విషయం ఏంటంటే.. ప్రపంచకప్ సమయంలో నన్ను కెప్టెన్‌గా నియమించడం వల్లే కొందరు క్రికెటర్లు, తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని బోర్డు ముందు ఒప్పుకున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే నేను అందరి పేర్లను బయటకు వెల్లడిస్తా. ప్రభుత్వ అధికారులు, బోర్డు సభ్యులు, ఆటగాళ్లతో పాటు జట్టు యాజమాన్యంతో సహా అందరినీ బయటకు లాగుతా. అందుకోసం వేచి చూడండి" -గుల్బాదిన్ నైబ్, అఫ్గాన్ క్రికెటర్
ఇటీవలే వెస్టిండీస్‌తో సిరీస్‌ల్లో అన్ని ఫార్మాట్‌ల్లోనూ అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. ఈ కారణంతో అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ).. టెస్టుల్లో రహ్మత్ షా, వన్డేల్లో గుల్బదిన్ నైబ్, టీ20ల్లో రషీద్ ఖాన్‌లను తప్పించి అస్గర్ అఫ్గాన్ పగ్గాలు అప్పగించింది.