సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆ దేశ క్రికెట్ బోర్డు డైరెక్టర్ కాబోతున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో స్మిత్ రాకతో.. పరిస్థితులు చక్కబడతాయని బోర్డు అధ్యక్షుడు క్రిస్ నెంజాని భావిస్తున్నాడు.
దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా బోర్డు సీఈవో తంబా మూరెపై ఇప్పటికే వేటుపడింది. సంక్షోభానికి కారణమైన నెంజానితో పాటు బోర్డు సభ్యులందరూ రాజీనామా చేయాలని దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం డిమాండ్ చేసినప్పటికీ... వాళ్లు నిరాకరించారు.
స్మిత్ డైరెక్టర్‌గా ఎంపికైతే.. డిసెంబర్ 26న ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభమయ్యే లోపు కొత్త సెలక్షన్ ప్యానల్, కోచింగ్ సిబ్బందిని అతను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
22 ఏళ్లకే గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. సఫారీ సేనకు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న పిన్నవయస్కుడిగా రికార్డు ఇతడి పేరిటే నమోదైంది. దక్షిణాఫ్రికా తరఫున 117 టెస్టుల్లో 48.25 సగటుతో 9,265 పరుగులు, 197 వన్డేల్లో 37.98 సగటుతో 6,989 పరుగులు చేశాడు. అతడి తొలి ఇంగ్లాండ్ పర్యటనలోనే లార్డ్ మైదానంలో దిగ్గజ క్రికెటర్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (259) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఇదీ చూడండి: సిరీస్ విజయంపై కోహ్లీసేన దృష్టి.. ప్రతీకారంతో విండీస్