ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరఫున ఆడాలని ఉందని అంటున్నాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. 14వ సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వదులుకున్న తర్వాత విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టాడు.
"నేను విరాట్ కోహ్లీతో వెంటనే కలిసిపోతాను. అతడి సారథ్యంలో పనిచేయడం చాలా బాగుంటుంది. కోహ్లీతో బ్యాటింగ్ చేయడం కచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. నా ప్రయాణంలో అతడెప్పుడూ ఓ సహాయకారిగా ఉంటాడు. విరాట్ చాలా తెలివైనవాడు. అతడితో కలిసి పనిచేయడానికే నా మొదటి ప్రాధాన్యం".
- గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
ఐపీఎల్లో అత్యధిక పారితోషకం అందుకున్న విదేశీ ఆటగాళ్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకరు. టోర్నీలో ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ (దిల్లీ డేర్‌డెవిల్స్), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో రూ.9 కోట్లకు దిల్లీ జట్టు మ్యాక్స్‌వెల్‌ను సొంతం చేసుకున్నా.. ఆ సీజన్ తర్వాత అతడిని వదులుకుంది. గతేడాది జరిగిన ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 10.75 కోట్లు వెచ్చించగా.. అతడి ప్రదర్శనతో నిరాశ చెందిన టీమ్ యాజమాన్యం ప్రస్తుత సీజన్లో వదులుకుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ తరఫున ఆడాలని ఉందని మ్యాక్స్‌వెల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఫిబ్రవరి 18న ఐపీఎల్ మినీ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది.
ఇదీ చూడండి:చెపాక్ పిచ్‌పై మాజీల వాఖ్యలు.. గావస్కర్ చురకలు!