మూడు నెలలు శిక్షణ ఇస్తే ఇప్పుడూ టెస్టు క్రికెట్ ఆడేస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అంటున్నాడు. కెరీర్ చివరి దశలో తన బ్యాటింగ్ గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాదా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గంగూలీ 12 ఏళ్ల క్రితం 2008లో చివరగా భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2011లో చివరి సారి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో కనిపించాడు.
"వన్డేల్లో నాకు మరో రెండు సిరీస్‌ల్లో అవకాశం ఇచ్చినట్లయితే, ఎక్కువ పరుగులు చేసుండేవాడిని. నాగ్‌పుర్‌లో రిటైర్మెంట్ తీసుకోకపోయుంటే.. తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ పరుగులు చేసేవాడిని. అంతెందుకు ఇప్పుడు నాకు ఆరునెలల శిక్షణ ఇచ్చి, మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఆడనివ్వండి. కచ్చితంగా టెస్టు క్రికెట్లో భారత్ తరఫున పరుగులు సాధిస్తా. ఆరు అవసరం లేదు మూడు నెలలు ఇవ్వండి చాలు. మీరు అవకాశం ఇవ్వకపోవచ్చు కానీ నాలోని నమ్మకాన్ని మాత్రం పోగట్టలేరు."