టీమ్ఇండియా క్రికెటర్లకు ఒక్కొక్కరికీ ఒక్కోలా నియమాలు ఉంటాయని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో తండ్రి అయిన నటరాజన్.. తన కూతురును చూడకుండానే యూఏఈ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాడని చెప్పాడు. పితృత్వ సెలవులపై రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన సూటిదనం వల్ల స్పిన్నర్ అశ్విన్ జట్టులో ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. ఈ మేరకు ఓ పత్రికలో సన్నీ ఆర్టికల్ రాశాడు.
"అశ్విన్ చాలా రోజులుగా తన సూటిదనం కారణంగా టీమ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అశ్విన్ ఒకవేళ ఏ మ్యాచ్‌లోనైనా వికెట్లు తీయకపోతే తర్వాతి మ్యాచ్‌లో అతడ్ని పక్కన పెట్టేస్తారు. బ్యాట్స్‌మెన్‌కు మాత్రం ఇలా ఉండదు. ఒక మ్యాచ్‌లో వాళ్లు పేలవ ప్రదర్శన చేసినా.. తర్వాతి మ్యాచ్‌లో అవకాశం ఇస్తారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ అప్పుడు నటరాజన్ తండ్రి అయ్యాడు. అయినాసరే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం అతను యూఏఈ నుంచి ఆస్ట్రేలియాకు సరాసరి బయల్దేరాడు. టెస్టు సిరీస్ కోసం నెట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కానీ, జట్టులో చోటు మాత్రం ఇవ్వలేదు. జనవరి మూడో వారంతో పూర్తయ్యే టెస్టు సిరీస్ అనంతరం అతడు తన ఇంటికి వస్తాడు. కానీ, కెప్టెన్ కోహ్లీ తన బిడ్డను చూడటం కోసం ముందుగానే బయలుదేరాడు. వివిధ రకాల వ్యక్తులకు వివిధ నియమాలు ఉంటాయి"