రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్పందించిన అనుష్క శర్మ.. ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పింది. గావస్కర్ వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు గావస్కర్. తాను అనుష్కపై ఎలాంటి కామెంట్లు చేయలేదని వెల్లడించాడు.
"నేను అనుష్కను ఎక్కడా నిందించలేదు. అనుష్క.. విరాట్‌కు బౌలింగ్ చేస్తున్న సమయంలోని వీడియోపై మాట్లాడానంతే. విరాట్ లాక్డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్ మాత్రమే ఎదుర్కొన్నాడని చెప్పా. అది ఒక టెన్నిస్ బంతి ఆట. అందువల్ల కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు లాక్డౌన్లో అంతగా ప్రాక్టీస్ చేయలేదనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశా. ఇందులో తప్పుగా తీసుకోవాల్సి ఏముంది."