వివిధ లీగ్ల్లోని ఫ్రాంచైజీలు తమ తరపున ఆడే ఆటగాళ్లు అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ అంతే. పేరున్న ఆటగాళ్ల కోసం రూ. కోట్లు వెచ్చిస్తుంటారు. కొంతమంది ఆటగాళ్లు బాగా రాణించినా వారికి అంతగా పేరు రాదు. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. అఫ్ఘానిస్థాన్ ఆల్ రౌండర్ నబీ అదే కోవకు చెందుతాడు. అయితే తాజాగా నబీ ప్రదర్శనపై స్పందించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
"మనం ఆండ్రూ రసెల్ లాంటి ఆల్‌రౌండర్ల గురించి చెప్పుకుంటాం. నబీ లాంటి వారు ఆ జాబితాలో ఉండకపోవచ్చు. కారణం క్రికెట్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాని అఫ్ఘానిస్థాన్ నుంచి అతడు వచ్చాడు. ఐపీఎల్‌లో వార్నర్, బెయిర్ స్టో, రషీద్ ఖాన్, విలియమ్ సన్ లాంటి స్టార్‌లు ఉన్న జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందువల్ల అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఒక వేళ మరో ఫ్రాంచైజీలో ఉన్నట్లయితే కచ్చితంగా అతడి ప్రభావం అందరికీ తెలిసేది. నా అభిప్రాయం ప్రకారం టీ20ల్లో అతడు చాలా విలువైన ఆటగాడు. మంచి ఫీల్డర్, నాలుగు ఓవర్ల కోటాను సమర్థంగా పూర్తి చేయగలడు. ప్రారంభ ఓవర్ల లోనూ బౌలింగ్ చేయగలడు. అయిదు, ఆరు స్థానాలలో బ్యాటింగ్‌కు వచ్చి భారీ షాట్లు కొట్టగలడు."