భారత్‌లో డే/నైట్ టెస్టును సాధ్యం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీపై ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎట్టకేలకు టీమిండియా ముందడుగు వేసినందుకు అభినందనలు తెలియజేశారు.
"గులాబి టెస్టు ఆడేందుకు అంగీకరించిన మీకు (సౌరభ్), విరాట్‌కు అభినందనలు. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించినప్పుడు ఆడిలైడ్‌లోనూ గులాబి సమరం ఉంటుందనే భావిస్తున్నా. అప్పుడు అద్భుతంగా ఉంటుంది" - షేన్ వార్న్, ఆసీస్ మాజీ ఆటగాడు.
వెల్‌డన్ సౌరభ్. శీతకాలంలో ఆసీస్‌తో భారత్.. గులాబి మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటా -మైఖేల్ వాన్
భారత్ తొలి డే/నైట్ టెస్టుకు దేశవ్యాప్తంగా అద్భుత ప్రచారం లభించింది. అభిమానులతో స్టేడియం కళకళలాడుతోంది. కోహ్లీసేన స్థాయికి తగ్గట్టు బంగ్లాదేశ్ పోటీనివ్వలేకపోవడమే నిరాశ కలిగించే అంశం. అదే ఆసీస్, భారత్ సమరమైతే ఆ ఊపే వేరుగా ఉంటుంది. రెండు జట్లలోనూ బ్యాట్స్‌మెన్, పేసర్లు, స్పిన్నర్లు సమాన స్థాయిలో ఉంటారు. ఆట రసవత్తరంగా ఉంటుంది. గతేడాది అడిలైడ్‌లో పింక్ టెస్టు ఆడాలన్న ఆసీస్ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ 2015లో డే/నైట్ టెస్టులను ఆమోదించగా టాప్ టెస్టు దేశాల్లో 8, ఇప్పటికే వీటిని ఆడేశాయి. భారత్, బంగ్లా ఆడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది.
ఇదీ చదవండి: ఆ ఒక్క బౌలర్ 200 పరుగులు సమర్పించుకున్నాడు