బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ గురువారం.. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో సమావేశమయ్యాడు. భారత క్రికెట్ భవిష్యత్తు కార్యాచరణ గురించి వారితో చర్చించాడు. ఈ ఫొటోని ట్విట్టర్లో షేర్ చేసింది బీసీసీఐ.
ఈ సమావశంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. బోర్డు కార్యదర్శి జై షా ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌లో సెలక్షన్ కమిటీ సభ్యులూ పాల్గొన్నారు. "అధ్యక్షుడు, కార్యదర్శి.. కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో సమావేశమయ్యారు. భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై వాళ్లు చర్చించారు. అధ్యక్షుడు తన ఆలోచనలు చెప్పాడు" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.
దాదా చేతిలో సెలక్టర్ల భవితవ్యం
ఎమ్మెస్కే సారథ్యంలోని సెలక్షన్ కమిటీ భవితవ్యం ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చేతిలో ఉంది. బీసీసీఐ పాత రాజ్యాంగం ప్రకారం సెలక్టర్ల పదవి కాలం గరిష్ఠంగా నాలుగేళ్లు మాత్రమే. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన బోర్డు రాజ్యాంగంలో ఈ నిబంధనను సవరించారు. సెలక్టర్లు ఐదేళ్లు పదవిలో ఉండొచ్చు. 2015 బీసీసీఐ ఏజీఎంలో సెలక్టర్లుగా నియమితులైన ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్‌జోన్), గగన్ ఖోడా (సెంట్రల్ జోన్)ల పదవి కాలం కొత్త రాజ్యాంగం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పూర్తి కానుంది. 2016లో బాధ్యతలు తీసుకున్న జతిన్ పరాంజపే (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్‌సింగ్ (నార్త్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్)లకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది. మరి గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ఇవీ చూడండి.. శాంసన్ రాకతో పంత్ కెరీర్ ప్రమాదంలో పడనుందా..!