భారత మాజీ క్రికెటర్లు సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్.. మే 26న అరుదైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కలిసి 318 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాదాపు 21 ఏళ్లు పూర్తయిగా ఇంకా ఆనాటి మధుర జ్ఞాపకాలు.. క్రికెట్ ప్రియుల మదిలో చిరస్థాయిగా ఉండిపోయాయి.
శ్రీలంకను వణికించారు...
ఇంగ్లాండ్‌లోని టాంటన్ వేదికగా జరిగిన 1999 ప్రపంచకప్‌లో.. శ్రీలంక-భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సదాగోపన్ రమేశ్(5) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్ గంగూలీ 183 పరుగులు(158 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోయాడు. దాదాకు తోడుగా రాహుల్ ద్రావిడ్ 145 (129 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్సర్)కూడా బ్యాట్ ఝుళిపించగా.. 318 పరుగులు జోడించి ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించారు. ఐసీసీ ఈవెంట్లలో ఏ వికెట్‌కైనా ఇదే రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కాగా వన్డే చరిత్రలో ఇదే నాలుగో అత్యధికం.
ఈ మ్యాచ్‌లో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 373 పరుగులు సాధించింది భారత్. లక్ష్య ఛేదనలో 216 రన్స్‌కే ఆలౌటైంది లంక. భారత బౌలర్లలో రాబిన్ సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా 157 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్ఇండియా.
ఈ మ్యాచ్ ద్వారా రన్‌రేట్‌ను మెరుగుపర్చుకున్నభారత్.. సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే నెగ్గాల్సిన మ్యాచ్‌లో.. న్యూజిలాండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది భారత్. ప్రపంచకప్‌లో తొలిసారి బరిలోకి దిగిన గంగూలీ, ద్రవిడ్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్నారు.