తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజయాల సారథి.. శతకాల వారధి.. ఈ సవ్యసాచి! - ganguly cricket career

విదేశాల్లో భారత జెండాను ఎగురవేసి, వరుస విజయాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సౌరభ్​ గంగూలీ. బుధవారం.. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తరుణంలో ఆతడి క్రికెట్ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం!

సౌరభ్ గంగూలీ

By

Published : Oct 23, 2019, 1:57 PM IST

మ్యాచ్​​ ఫిక్స్​ కుంభకోణం.. జట్టు సమష్టిగా ఆడటంలో విఫలం... కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సచిన్​.. ఇవన్నీ ఒకానొక సమయంలోటీమిండియా ఎదుర్కొంటున్న సమస్యలు. అలాంటి పరిస్థితుల్లో సారథ్య బాధ్యతలు చేపట్టి, గమ్యంలేని నడక సాగిస్తున్న భారత జట్టును సరైన మార్గంలో పరుగులు తీయించాడు​ సౌరభ్​​ గంగూలీ. 2000-05 మధ్యకాలంలో టీమిండియాకు కెప్టెన్​గా ఉండి తనదైన మార్క్​ చూపించాడు.

కెప్టెన్​గానే కాకుండా ఆటగాడిగానూ సత్తాచాటాడు గంగూలీ. విదేశాల్లో భారత​ గెలుపు ప్రస్థానానికి సరైన బాటలు వేశాడు. బుధవారం.. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాదా.. తన కెరీర్​లో ఆడిన కొన్ని మరపురాని ఇన్నింగ్స్​లు​ ఇప్పుడు చూద్దాం!

అరంగేట్ర టెస్టులోనే శతకం..

1996లో లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టుతో గంగూలీ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్​లోనే శతకంతో విజృంభించాడు. అదే సిరీస్​లోని తర్వాతి టెస్టులోనూ సెంచరీ సాధించాడు. ఇలా తొలి రెండు మ్యాచ్​ల్లోనే ​శతకాలు చేసిన భారత బ్యాట్స్​మన్​గా రికార్డులకెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ నిలిచాడు.

రెండు చేతులతో ఆడగల సవ్యసాచి..

గంగూలీ అనగానే ఎడమ చేతి వాటం బ్యాటింగ్​.. ఆఫ్ సైడ్​ దిశగా అతడు కొట్టే కవర్​ డ్రైవ్​లే గుర్తుకువస్తాయి. అయితే సౌరభ్​ కుడి చేత్తోనూ బ్యాటింగ్​ చేయగలడు. చాలా మ్యాచ్​ల్లోఇలానే ఆడి సవ్యసాచి అనిపించుకున్నాడు.

ప్రపంచకప్​లో ఇప్పటికీ దాదానే కింగ్..

వరల్డ్​కప్​ టోర్నీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు గంగూలీ. 1999 ప్రపంచకప్​లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో 183 పరుగులతో విజృంభించాడు. ఇందులో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటికీ మెగాటోర్నీలో ఓ భారత ఆటగాడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ మ్యాచ్​లో ద్రవిడ్​తో కలిసి 318 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా శ్రీలంకపై 157 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా.

లార్డ్స్​లో చొక్కా విప్పిన వేళ...

2002లో ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన నాట్​వెస్ట్ వన్డే సిరీస్​ను భారత క్రికెట్​ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోలేరు. లార్డ్స్​లో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో ఇంగ్లీష్ జట్టును ఓడించింది టీమిండియా​. ఆ మ్యాచ్​లో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. గంగూలీ (60), కైఫ్ (87*), యువరాజ్(69) అర్ధశతకాలతో రాణించి జట్టును గెలిపించారు. ఈ ఉత్కంఠ విజయం అనంతరం గంగూలీ... తన చొక్కా విప్పి గాల్లోకి ఎగరేసి సందడి చేశాడు.

చివర్లో గాడి తప్పిన బ్యాటింగ్​..

ఎన్నో అద్భుత ఇన్నింగ్స్​లు​ ఆడి టీమిండియా జైత్రయాత్రలో ఎనలేని పాత్ర పోషించిన గంగూలీ.. మెల్లమెల్లగా బ్యాటింగ్​లో విఫలమవుతూ వచ్చాడు. 2003 ప్రపంచకప్ అనంతరం ఫామ్​ కోల్పోయాడు. 2005 పాకిస్థాన్​ సిరీస్​లో ఘోరంగా విఫలమైన సౌరభ్..​ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తర్వాత స్థానాన్నీ కోల్పోయాడు. జట్టులోకి వస్తూ, పోతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2007లో క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

అగ్రశ్రేణి ఆటగాళ్లను పరిచయం చేసిన దాదా

యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్​, గౌతమ్ గంభీర్, మహేంద్రసింగ్ ధోనీ లాంటి అగ్రస్థాయి ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్​కు పరిచయం చేశాడు దాదా. సౌరభ్​ కెప్టెన్​గా వచ్చిన తర్వాతే టీమిండియా క్రికెట్ రూపురేఖలు మారాయి.

113 టెస్టులు ఆడిన గంగూలీ 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 311 వన్డేల్లో 11,313 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి.

గంగూలీ రికార్డులు..

  • వరుసగా నాలుగు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డులు అందుకున్న ఏకైక ఆటగాడు దాదా.
  • ప్రపంచకప్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(183) నమోదు చేసిన భారత క్రికెటర్.
  • వన్డేల్లో 10వేల పైచిలుకు పరుగులు, వందకు పైగా వికెట్లు, వందకు పైగా క్యాచ్​లు అందుకున్న ఐదుగురు క్రికెటర్లలో సౌరభ్ ఒకడు.
  • తొలి టెస్టు మ్యాచ్​లో సెంచరీ చేసి, చివరి మ్యాచ్​లో మొదటి బంతికే ఔటైన ఏకైక బ్యాట్స్​మన్ గంగూలీనే.

ABOUT THE AUTHOR

...view details