టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, తూర్పు దిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఉదారత చాటుకున్నారు. తన ఇంట్లో సహాయకురాలిగా (పనిమనిషి) పనిచేస్తున్న సరస్వతి పత్రా అంత్యక్రియలను నిర్వహించారు. ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పని చేస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా మధుమేహం, అధిక రక్త పోటుతో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే లాక్‌డౌన్ కారణంగా మృతదేహాన్ని ఒడిశాలో ఉంటున్న ఆమె కుటుంబానికి పంపలేని పరిస్థితుల్లో గంభీర్ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.
"నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పని మనిషి కాదు. ఆమె నా కుటుంబ సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందర్నీ గౌరవించాలనేదే నా సిద్ధాంతం. ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఇదే మార్గం. అది నా దేశం ఆలోచన. ఓం శాంతి."