కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగనున్నట్లు సోమవారం వెల్లడించాడు. కెనడా గ్లోబల్ టీ20 లీగ్‌లో టొరంటో నేషనల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెక్‌కల్లమ్... ఈ టోర్నీ తర్వాత పూర్తిగా క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు స్పష్టం చేశాడు.
" క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. కెనడా టీ20 లీగ్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. యూరో టీ20 స్లామ్లో ఆడాలని అనుకోట్లేదు. నా నిర్ణయానికి మద్దతిచ్చిన నిర్వాహకులకు నా ధన్యవాదాలు. క్రికెట్లోకి అడుగుపెట్టి 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడాన్ని గర్వంగా ఫీలవుతున్నా. ఇంతకాలం ఆడతానని ఆటలోకి అడుగుపెట్టినపుడు అనుకోలేదు".
--మెక్‌కల్లమ్, న్యూజిలాండ్ క్రికెటర్
సిక్సర్ల వీరుడు...
2002లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్.. 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6,083 పరుగులు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 2,140 రన్స్, టెస్టుల్లో 6,453 పరుగులు సాధించాడు.
మొత్తం టీ20 కెరీర్లో 370 మ్యాచ్‌ల్లో 9,922 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు ఇతడి సొంతం. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ 37 ఏళ్ల కివీస్ క్రికెటర్...తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సహా కొన్ని టీ20 లీగ్‌లలో ఆడాడు. ఐపీఎల్ తొలి సీజన్లో కోల్‌కతా జట్టులో తొలిసారి ఆడిన మెక్‌కల్లమ్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 73 బంతుల్లో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ అతడి టీ20 కెరీర్లో మరపురానిది. కెనడా లీగ్‌లో తన చివరి మ్యాచ్‌ను మాంట్రియల్ టైగర్స్‌తో ఆడనున్నాడు.
ఇవీ చూడండి...వెటోరీ జెర్సీ రిటైర్: కివీస్ క్రికెట్ బోర్డు