తెలంగాణ

telangana

ETV Bharat / sports

కశ్మీర్​​ చిన్నారులను క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు రైనా ఆసక్తి - Former Indian player Suresh Raina news

కశ్మీర్‌లోని చిన్నారులను క్రికెట్​ వైపు ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాడు మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా. ఇందుకోసం ఓ ప్రతిపాదనా లేఖను జమ్ము కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌, ఎస్‌ఎస్‌పీ అనంత్‌నాగ్‌ సందీప్‌ చౌదరీకి పంపించాడు. రైనా కూడా కశ్మీరీ పండిత కుటుంబం నుంచి రావడం విశేషం.

cricketer raina latest news
కశ్మీర్​​ చిన్నారులను క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు రైనా సిద్ధం

By

Published : Aug 26, 2020, 4:07 PM IST

జమ్ము కశ్మీర్‌.. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. వేర్పాటువాద గొడవలు.. ఉగ్రవాద దాడులు.. ముష్కరులకు అండగా నిలిచే స్థానికులు.. పాక్‌ సైనికులు కురిపించే మోర్టార్‌ షెల్స్‌.. పోలీసులపై రాళ్లదాడులు అక్కడ సాధారణం. యువత ఎదిగేందుకు సరైన ఉపాధి అవకాశాలు ఉండేవి కావు. విద్యార్థులు చదువుకొనేందుకు మెరుగైన విద్యాసంస్థలు ఉండవు. పైగా ఆడపిల్లలకు సవాలక్ష కట్టుబాట్లు.

ఇక ఆటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. క్రికెట్‌ సహా అన్నింటా వెనుకంజే. పెట్టుబడులు పెట్టినా అక్కడి ఆస్తులపై హక్కులు ఉండవు కాబట్టి ఎవ్వరూ ముందుకొచ్చేవారు కాదు. మోదీ ప్రభుత్వం దానిని రద్దు చేయడం వల్ల పరిస్థితులు మారుతున్నాయి. ఇందులో భాగంగానే టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఓ చక్కని ప్రతిపాదనతో ముందుకొచ్చాడు.

జమ్ము కశ్మీర్‌లోని నిరుపేద చిన్నారులు క్రికెట్లో రాణించేందుకు సహాయం చేస్తానని రైనా అన్నాడు. ఒక క్రమపద్ధతిలో వారికి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయికి ఆడేలా ప్రోత్సహిస్తానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనా లేఖను జమ్ము కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌, ఎస్‌ఎస్‌పీ అనంత్‌నాగ్‌ సందీప్‌ చౌదరీకి పంపించాడు. చిన్నారులను అభివృద్ధి చేసేందుకు తన క్రికెట్‌ అనుభవం ఉపయోగపడుతుందని అన్నాడు. తన ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఎంతో కష్టపడాలని, సహకారం అవసరమని పేర్కొన్నాడు.1) గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ 2) మాస్టర్‌ క్లాసెస్‌ నిర్వహించడం 3) మానసికంగా దృఢత్వం పెంపొందించే తరగతులు 4) శారీరక దారుఢ్యం 5) నైపుణ శిక్షణ ద్వారా మెరికల్లాంటి క్రికెటర్లను తయారు చేస్తానని రైనా అన్నాడు.

"క్రికెట్‌ అంటే ఒక ఆట మాత్రమే కాదు. ఒక క్రికెటర్‌గా మారడం వెనక ఒక మహత్తర ప్రక్రియ ఉంటుంది. శారీరక, మానసిక దృఢత్వం, విలువలు, నైపుణ్యాలు, జీవితంలో ముందుకెళ్లడం వంటివి ఉంటాయి. క్రీడల కోసం శిక్షణ పొందే చిన్నారులు ఒక క్రమశిక్షణా యుతమైన జీవితానికి అలవాటవుతారు. శారీరకంగా బలంగా ఉంటారు. అదే దేశ భవిష్యత్తుకు అవసరం. ఈ అవకాశాన్ని ఉపయోగించి భవిష్యత్తు తారలను రూపొందిచాలనే పట్టుదలతో ఉన్నాను" అని రైనా లేఖలో రాసుకొచ్చాడు.

జమ్ముకశ్మీర్‌ చిన్నారుల కోసం రైనా ఎందుకింత కష్టపడుతున్నాడంటే అతడి మూలాలు అక్కడే ఉన్నాయని తెలిసింది. తనది కశ్మీరీ వారసత్వమని, తానో కశ్మీరీ పండితుడినని వెల్లడించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ తనకు కర్మభూమి అని జమ్ముకశ్మీర్‌ కూడా అంతే సమానమని పేర్కొన్నాడు. ఆ ప్రాంతంతో తనకెంతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2020 ఆడేందుకు రైనా యూఏఈ వెళ్లాడు. టోర్నీ ముగిసిన తర్వాత తన కార్యక్రమాలపై దృష్టిపెట్టే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details