క్రికెట్లో ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలో 'డేటా' ఎంతగానో ఉపయోగపడుతుందని టీమ్‌ఇండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఆటలో పోటీని పెంచేందుకు ఇది ఊతమిస్తోందని వెల్లడించారు. 'బేస్‌బాల్ మాదిరిగానే క్రికెట్‌కు సైతం గణాంకాలే ఆధారం. పదిహేనేళ్లలో మనం ఒక్క సగటును కాకుండా ఇతర విషయాలను కూడా పోల్చి చూస్తున్నాం. వ్యూహరచన, ఆటగాళ్ల ఎంపికకు డేటా సాయపడుతోంది' అని ఎంఐటీ క్రీడా విశ్లేషణ సదస్సులో ద్రవిడ్ పేర్కొన్నారు. ఎంఐటీలో క్రికెట్ గణాంకాలపై ఇలాంటి సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి.
టీమ్‌ఇండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్.. ఇంగ్లాండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి, ఇషా గుహ సైతం సదస్సులో పాల్గొన్నారు. ఆటగాళ్లు సాధన చేసేందుకు, ఫిట్‌గా ఉండేందుకు, బౌండరీలు, సిక్సర్లు బాదేందుకు ఇంకా మరెన్నో అంశాల్లో డేటా ఎలా ఉపయోగపడుతుందో చర్చించారు. బాస్కెట్ బాల్‌లోని '3 పాయింట్ రెవల్యూషన్' తరహాలోనే క్రికెట్లో డేటా ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు.