తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​లో విధ్వంసకర ఇన్నింగ్స్​.. కపిల్ 175 నాటౌట్​ - kapil dev 175 notout

1983.. ఆ ఏడాది ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి. కానీ భారత క్రీడా చరిత్రను మలుపు తిప్పి, దేశంలో క్రికెట్‌పై ఆకర్షణను అమాంతం పెంచేసిన కపిల్‌సేన ప్రపంచకప్‌ విజయం చిరస్మరణీయం. ఫైనల్లో పటిష్టమైన కరీబియన్లను మట్టికరిపించిన టీమ్‌ ఇండియా అద్భుత ప్రదర్శన, లార్డ్స్‌లో కపిల్‌ సగర్వంగా కప్పును అందుకుంటున్న కమనీయ దృశ్యాలను అభిమానులెలా మరిచిపోగలరు! కపిల్‌ రన్నింగ్‌ క్యాచ్‌, శ్రీకాంత్‌ బ్యాటింగ్‌, మదన్‌లాల్‌ బౌలింగ్‌, అమర్‌నాథ్‌ ఆల్‌రౌండ్‌ జోరు ఇప్పటికీ తాజానే. తొలి కప్పుతో భారత్‌ చరిత్ర సృష్టించే క్రమంలో మరో అద్భుతాన్నీ క్రికెట్‌ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ అద్భుతమే కపిల్‌ 175​ నాటౌట్​.

Kapil Dev made 175 runs
కపిల్​దేవ్​ 175 పరుగులు

By

Published : Jun 2, 2020, 6:58 AM IST

అత్యంత క్లిష్ట దశలో, జట్టు ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించే ముప్పు ఎదుర్కొంటున్న స్థితిలో, ఆశలన్నీ అడుగంటిన వేళ జింబాబ్వేపై కపిల్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. క్రికెట్‌ చరిత్రలోనే మేటి ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కపిల్‌ 175 నాటౌట్‌ (138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లు) కనీ వినీ ఎరుగని ఇన్నింగ్స్‌ ఆడేశాడు. ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.

17 పరుగులకే 5 వికెట్లు...

జూన్‌ 18. వేదిక టర్న్‌బ్రిడ్జ్‌ వెల్స్‌. జింబాబ్వేతో పోరు. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ (60 ఓవర్లు)లో గెలవకుంటే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది భారత్‌. అయితే మ్యాచ్​ మొదలైన కాసేపట్లోనే ముప్పు ముంగిట నిలిచింది. స్వింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై జింబాబ్వే పేసర్లు పీటర్‌ రాసన్‌ (3/47), కెవిన్‌ కరన్‌ (3/65) ధాటికి విలవిల్లాడిపోయింది. ఓపెనర్లు గావస్కర్‌, శ్రీకాంత్‌లు ఇద్దరూ డకౌట్‌ కాగా.. 17 పరుగులకే అయిదు వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీమ్​ ఇండియా పనైపోయినట్లేనని అనుకున్నారంతా. కానీ కపిల్‌లోని పోరాట యోధుడు మ్యాచ్‌ను గమనాన్ని మార్చబోతున్నాడని ఎవరూ ఊహించలేదు. పట్టుదలతో నిలిచిన అతడు.. లోయర్‌ ఆర్డర్‌ నుంచి లభించిన కాసింత సహకారంతో జట్టుకు మంచి స్కోరును అందించాడు. అతడు ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు అదరహో.

కపిల్​దేవ్​

తొలుత రోజర్‌ బిన్నీతో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు కపిల్‌. అలా ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. అయితే బిన్నీ, రవిశాస్రి (1) వెంట వెంటనే ఔటయ్యాక మదన్‌ లాల్‌ (17)తో ఇన్నింగ్స్​ నడిపించాడు కపిల్​. భారత్‌ కాస్త కోలుకుంది. గౌరవప్రదమైన స్కోరుపై ఆశలు కలిగాయి. మదన్‌లాల్‌ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించేటప్పటికి 140 పరుగులు. ఎక్కువ స్కోరేమీ కాదు. భారత్‌ను కట్టడి చేసినట్లేనని, కాస్త కష్టపడితే మ్యాచ్‌ తమదేనని జింబాబ్వే భావించి ఉంటుంది. కానీ సుడిగాలి ఇన్నింగ్స్‌తో కపిల్‌ ఆ జట్టుకు షాకిచ్చాడు. సయ్యద్‌ కిర్మాణి 26 నాటౌట్‌ (56 బంతుల్లో 2 ఫోర్లు) అండగా నిలవగా భారీ షాట్లు ఆడడం మొదలు పెట్టాడు. షార్ట్‌ బౌండరీని సద్వినియోగం చేసుకుంటూ ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దూకుడుగా ఆడినా ఎప్పుడూ నియంత్రణలోనే ఉన్న కపిల్‌ 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

శతకం తర్వాత గేర్​ మార్చిన అతడు.. మరింతగా విరుచుకుపడ్డాడు. నిర్దాక్షిణ్య బ్యాటింగ్‌తో రాసన్‌, కరన్‌ల గణాంకాలను సవరించాడు. కిర్మాణితో అభేద్యమైన తొమ్మిదో వికెట్‌కు కపిల్‌ 126 పరుగులు జోడించాడు. అప్పట్లో అది రికార్డు. 2010 వరకు ఆ రికార్డు కొనసాగింది. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ టర్నర్‌ 171 పరుగులతో 1975లో నెలకొల్పిన అత్యధిక వన్డే స్కోరును కపిల్‌ బద్దలు కొట్టాడు. కపిల్‌ వీర విహారంతో మొదట 60 ఓవర్లలో 8 వికెట్లకు 266 పరుగులు చేసిన భారత్‌.. జింబాబ్వేను 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై కూడా గెలిచిన టీమ్​ ఇండియా‌.. సెమీఫైనల్‌ చేరింది. కపిల్‌ ఇన్నింగ్సే లేకుంటే.. భారత్‌కు అసలు ప్రపంచకప్పే దక్కేది కాదేమో!

** కపిల్‌ మహా ఇన్నింగ్స్‌ను చూసే భాగ్యం స్టేడియంలో ఉన్న వాళ్లకు తప్ప టీవీ వీక్షకులకు దక్కలేదు. బీబీసీ సిబ్బంది సమ్మె అందుకు కారణం. కనీసం ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏ రికార్డింగ్‌ కూడా లేదు.

ఇదీ చూడండి: మరపురాని మెరుపులు: సూపర్​హిట్​.. సచిన్​ అప్పర్​కట్​

ABOUT THE AUTHOR

...view details