టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్, ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి ఒక విషయం నేర్చుకోవాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో ఉండాలని.. తమదైన రోజు ఔటవ్వకుండా బ్యాటింగ్ చేయాలని.. జట్టును విజయతీరాలకు చేర్చాలని సలహా ఇచ్చాడు.
"తనదైన రోజు కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పకుండా జట్టును గెలిపిస్తాడు. ఫార్మాట్ ఏదైనా చివరి వరకు క్రీజులో ఉండి విజయం సాధిస్తాడు. అతడి బ్యాటింగ్‌లో అదో ప్రత్యేకత. ఈ విషయంలో పంత్, కిషన్.. కోహ్లీని చూసి నేర్చుకోవాలి. మీదైన రోజు ఔటవ్వకుండా ఆడాలి. చివరివరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాలి. నాకు కూడా సచిన్ ఇదే విషయం చెప్పేవాడు. 'ఈ రోజు నువ్వు బాగా ఆడుతున్నావని తెలిస్తే.. వీలైనంతసేపు క్రీజులో పాతుకుపో. చివరి వరకు పరుగులు చేస్తూ నాటౌట్‌గా మిగిలిపో. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. పరుగులు చేస్తావో లేదో చెప్పలేం. కానీ, నువ్వు బాగా ఆడే రోజు పరిస్థితి ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. దాంతో ఆ రోజు ఔటవ్వకుండా ఆడి పరుగులు సాధించాలి' అని సచిన్ నాతో అనేవాడు" అని వీరూ గుర్తు చేసుకున్నాడు.