2011 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవాలనే లక్ష్యంతోనే జట్టు అడుగుపెట్టినట్లు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఆ విజయానికి శుక్రవారంతో పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అతను మాట్లాడాడు. "ఆ ప్రపంచకప్ విజయం నిన్ననే అందినట్లు అనిపించడం లేదు. నా వరకైతే అలా లేదు. పదేళ్లు అవుతుందా? ఏమో గతంలోకి ఎక్కువగా తొంగి చూడను. అది గర్వపడే సందర్భం. కానీ ఇప్పుడు టీమ్‌ఇండియా ముందుకు సాగాల్సిన సమయమిది. వీలైనంత త్వరగా మరో ప్రపంచకప్‌ను గెలవాలి" అని చెప్పాడు. శ్రీలంకతో ఫైనల్లో 97 పరుగుల దగ్గర ఔటవడం దురదృష్టకరమని, తనకలాగే జరుగుతూ వచ్చిందని అతనన్నాడు.
"2011లో అసాధ్యమైనదేదీ మేం అందుకోలేదు. ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంపికైనప్పుడే గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అవును.. మేం దేశం గర్వపడేలా చేశాం. ప్రజలు ఆనందపడ్డారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లోనూ గెలిస్తే అప్పుడు ప్రపంచ క్రికెట్లో టీమ్‌ఇండియాను సూపర్ పవర్‌గా పరిగణించేవాళ్లేమో! కానీ పదేళ్లవుతున్నా మరో ప్రపంచకప్ గెలవలేకపోయాం. అందుకే ఈ ప్రత్యేక సందర్భంలో గతం గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటున్నా. మేం మా బాధ్యతలు నిర్వర్తించాం అంతే. ఏప్రిల్ 2న మేం చేసింది ఇతరుల మేలు కోసం కాదు. గతం కంటే భవిష్యత్ మీద ధ్యాస పెట్టడం అవసరం"