ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్ల ఎంపికపై దుమారం రేగుతోంది. సునీల్ జోషి సారథ్యంలోని సెలెక్షన్ కమిటీపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాళ్ల ఎంపికకు పాటించిన ప్రమాణాలపై ఒకరు.. ఐపీఎల్ ప్రదర్శనను టెస్టులకు ఎలా పరిగణిస్తారని మరొకరు..ప్రతిభావంతుడి సెలెక్షన్ తప్పుబట్టడం సరికాదంటూ ఇంకొకరు మాటలు దూశారు.
"ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడైన సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బ్యాటింగ్ నైపుణ్యం పరంగా చూస్తే టీమ్‌ఇండియా అత్యుత్తమ ఆటగాడితో సూర్యకుమార్‌ను పోల్చగలను. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. భారత జట్టులో స్థానం కోసం ఇంతకంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు. తన కెరీర్‌లో సూర్య అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఎంపికకు ఫామ్, ఫిట్‌నెస్ ప్రమాణాలు కాకుండా ఇంకేముంటాయి? గాయం కారణంగా రోహిత్‌శర్మ జట్టు దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యతో మిడిలార్డర్‌ను పటిష్టం చేయొచ్చు. సూర్యను ఎంపిక చేయకపోవడం వెనుక ఉద్దేశమేంటో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రశ్నించాలి" - దిలీప్ వెంగ్‌సర్కార్
"ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా కేఎల్ రాహుల్‌ను టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం చెడు సంప్రదాయం. మరీ ముఖ్యంగా గత కొన్ని టెస్టు మ్యాచ్‌ల్లో విఫలమైన ఆటగాడిని ఎంచుకున్నారు. అతడు విజయవంతమవుతాడా? విఫలమవుతాడా? అన్నది వేరే సంగతి. కాని ఇలాంటి ఎంపికలు రంజీ ఆటగాళ్లను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తాయి" - సంజయ్ మంజ్రేకర్
"మంజ్రేకర్ టెస్టు జట్టులోకి రాహుల్ ఎంపికను ప్రశ్నించడాన్ని అస్సలు ఒప్పుకోను. మూడు ఫార్మాట్లలోనూ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసిన రాహుల్ అక్కడే తొలి సెంచరీ సాధించాడు. మంజ్రేకర్ ‘ముంబయి’ని దాటి ఆలోచించలేడు. అదే సమస్య. అతడి దృష్టిలో అంతా ముంబయే. హర్భ భోగ్లేకు కూడా ముంబయి తప్పితే ఇంకేం తెలియదు. వాళ్లు తటస్థులు కాకపోవడం అసలు సమస్య" - కృష్ణమాచారి శ్రీకాంత్