మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ వారసుడిగా కోహ్లీని, కీపర్ వారసుడిగా పంత్‌ను పోలుస్తుంటారు అభిమానులు. మరి అలాంటి యువ క్రికెటర్ పంత్‌కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కెప్టెన్ కోహ్లీ, యాజమాన్యాన్ని ప్రశ్నించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ . భవిష్యత్తులో పెద్ద ఆటగాడు అవుతాడని ఊరించి... జట్టులో చోటివ్వనప్పుడు అతడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా 2012లో సచిన్, గంభీర్, తనను స్లోఫీల్డర్లు అనే కారణంతో రోటేషన్ విధానం పాటించిన ఎంఎస్ ధోనీ గురించి ఓ ఉదాహరణ ఇచ్చాడీ విధ్వంసకర క్రికెటర్.
" యువ క్రికెటర్ రిషభ్‌పంత్‌కు చోటివ్వడం లేదు. అలాంటప్పుడు అతడు పరుగులెలా చేస్తాడు. రిజర్వు బెంచ్‌పై సచిన్ తెందూల్కర్‌ను కూర్చోబెట్టినా పరుగులు చేయలేడు. పంత్‌ను మ్యాచ్ విజేతగా భావిస్తే అతడినెందుకు ఆడించడం లేదు? ఎందుకంటే అతడిలో నిలకడ లేదనేనా? మా హయాంలో కెప్టెన్ ఆటగాళ్లందరితో మాట్లాడేవాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆపని చేస్తున్నాడో లేదో తెలియదు. జట్టులో నేను అంతర్భాగం కాదు గానీ ఆసియాకప్‌నకు జట్టును నడిపించిన రోహిత్ శర్మ అందరితో మాట్లాడేవాడని చెప్పగా విన్నాను"
-- వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
2011-12 సిరీస్‌లో భాగంగా జట్టు ఎంపిక చేసినప్పుడు మహీ కొత్త తరహాలో రొటేషన్ విధానాన్ని ఉపయోగించాడు. ఇందులో టాప్-3 ఆటగాళ్లైన సచిన్, సెహ్వాగ్, గంభీర్‌లను ఫీల్డింగ్ నెమ్మదిగా చేస్తారనే కారణంతో తప్పించాడట. ఈ విషయాన్నీ వీరూ అభిమానులతో పంచుకున్నాడు.
" టాప్-3 ఆటగాళ్లు ఫీల్డింగ్ నెమ్మదిగా చేస్తారని ఎంఎస్ ధోనీ ఆస్ట్రేలియాలో చెప్పాడు. కానీ మమ్మల్ని ఎప్పుడూ సంప్రదించలేదు. ఆ విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. జట్టు సమావేశంలో కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు ఈ విషయం చెప్పాడు. జట్టు మీటింగ్‌లో మాత్రం రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వడం కోసమే రొటేషన్ విధానం అమలు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడూ అదే జరుగుతుంటే మాత్రం కచ్చితంగా తప్పే".
-- వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్
2019 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన ధోనీ స్థానంలో పంత్ చోటు దక్కించుకున్నాడు. పలు సిరీస్‌లకు ఎంపికైనా పూర్తిగా కీపింగ్, బ్యాటింగ్‌లోనూ నిరాశపర్చాడు. అయితే ఈ మధ్య కాలంలో అతడికి బదులు కేఎల్ రాహుల్‌ను ఉపయోగించగా... మంచి ఫలితాలు వస్తున్నాయి. బ్యాట్, గ్లవ్స్తోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు రాహుల్. అంతేకాకుండా ఒక బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకొనేందుకు అవకాశం ఏర్పడిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాహుల్ ద్విపాత్రాభినయంతో పంత్‌కు అవకాశాలు రావట్లేదు. తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు.