టీవీ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సామాజిక మాధ్యమాల్లో మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డేనైట్ టెస్టు జరిగింది. ఈ సందర్భంగా మంజ్రేకర్ ఈడెన్ పిచ్‌ను పరిశీలిస్తున్న ఫొటోను ట్వీట్ చేసి అందులో "లవ్ మై జాబ్" అని తెలిపాడు.
ఇది చూసిన నెటిజన్లు సంజయ్‌ను ట్రోల్ చేశారు. వివిధ మీమ్స్‌తో ఛలోక్తులు విసిరారు. కొంతమంది..."నీ కామెంట్రీ వస్తే మేం టీవీ రిమోట్‌లో మ్యూట్ బటన్‌ను ఇష్టపడతాం" అని స్పందించారు.
గతంలోనూ ఇలానే...
ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా మంజ్రేకర్ మీడియాతో మాట్లాడుతూ... జడేజాపై కామెంట్ చేశాడు. "అడపా దడపా(బిట్స్ అండ్ పీసెస్) ఆడే రవీంద్ర జడేజా లాంటి క్రికెటర్లకు నేను అభిమానిని కాదు" అని అన్నాడు. ఈ విషయంపై స్పందించిన జడేజా వెంటనే కౌంటర్ ఇచ్చాడు. "నీ కన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడుతున్నాను. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకో. నీ నోటి నుంచి వచ్చే వ్యర్థమైన మాటలు ఆపు" అని జడ్డూ సీరియస్ అయ్యాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జడేజా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని జట్టును గెలిపించినంత పని చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో జడేజాపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకున్నాడు మంజ్రేకర్. అప్పట్నుంచి ఈ మాజీ క్రికెటర్ ట్విట్టర్‌లో ఏదైనా పోస్టు పెడితే... నెటిజన్లు ఇదే విషయాన్ని ఉద్దేశించి ట్రోలింగ్ చేస్తుండటం గమనార్హం.