టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒత్తిడిలోనూ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న టీమ్‌ఇండియాను నేనున్నానంటూ ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్(73*; 117 బంతుల్లో 8x4)తో కలిసి పంత్(101; 118 బంతుల్లో 13x4, 2x6) ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించాడు.
ఇది పంత్ కెరీర్‌లో మేటి ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలుస్తుందనడంలోనూ సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే అతడిని పలువురు మాజీలు అభినందిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఇంగ్లాండ్ మాజీ సారథులు మైకేల్ వాన్, పీటర్సన్‌తో పాటు తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ సైతం పొగడ్తలతో ముంచెత్తాడు. 'నువ్వెన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు. ఎప్పుడు చేశావన్నదీ ముఖ్యమే. తొలి ఇన్నింగ్స్ లాగే నువ్వు రెండో ఇన్నింగ్స్‌లోనూ సమన్వయంతో ఆడి జట్టుకు అవసరమైన వేళ రాణించినప్పుడు.. నిజమైన మ్యాచ్ విన్నర్‌వి. నిన్ను గమనిస్తూనే ఉంటా పంత్' అని ట్వీట్ చేశాడు.