ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశాడు. తన భార్య కైలీతో వైవాహిక బంధానికి దాదాపు ఏడేళ్ల తర్వాత వీడ్కోలు పలికాడు. స్నేహపూర్వకంగా విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కష్టమైన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు ఈ ఇద్దరు దంపతులు. అయితే ఇందుకు భారీ మొత్తాన్ని భరణంగా చెల్లించనున్నాడు.
విడాకుల కోసం 200 కోట్లా..!
క్లార్క్-కైలీ జంట కోర్టు మెట్లు ఎక్కకుండానే విడాకుల విషయాన్ని పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కైలీకి దాదాపు రూ.200 కోట్లు చెల్లించనున్నాడట ఈ స్టార్ క్రికెటర్. ఈ మొత్తం చెల్లించేందుకు బోండీ ప్రాంతంలో బీచ్ ఒడ్డున కొనుక్కున్న గృహాన్ని ఆమెకు ఇచ్చేయనున్నట్లు సమాచారం. 2012లో ఈ మాజీ మోడల్, టీవీ ప్రజెంటర్ కైలీని పెళ్లి చేసుకున్నాడు క్లార్క్. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉంది. ఈ చిన్నారి బాధ్యతలు ఇద్దరూ పంచుకోనున్నారు.
2011లో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్.. ఆసీస్ క్రికెట్ జట్టును అద్భుతంగా నడిపించాడు. పాంటింగ్‌కు సరైన వారసుడిగా ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్ సిరీస్ అనంతరం క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.