తెలంగాణ

telangana

'కూర్పు'లో నిలిచి తుదిజట్టులో ఉండేదెవరో..!

By

Published : Dec 14, 2019, 7:50 AM IST

ప్రపంచకప్‌ సందర్భంగా కూర్పు విషయంలో టీమ్‌ఇండియా ఎంతగా ఇబ్బంది పడిందో చూశాం. సెమీస్‌లోనే భారత్‌ కథ ముగియడానికి సమతూకం లేని కూర్పు ముఖ్య కారణమన్నది స్పష్టం. అయితే ఈ మెగా టోర్నీ తర్వాత కూడా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆదివారం వెస్టిండీస్‌తో ఆరంభమయ్యే వన్డే సిరీస్‌లోనూ కూర్పు ఓ కీలకాంశం కాబోతోంది. ఈ సిరీస్‌ కొందరు ఆటగాళ్లకు పరీక్షగా కూడా మారనుంది. మరి తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుంది.. ఏ స్థానంలో ఎవరు ఆడతారు..  అవకాశాల్ని ఎవరెంత మేర ఉపయోగించుకుంటారన్నది ఆసక్తికరం.

formation in team India cricket make head ache.. who is got opportunity odi series against west indies
'కూర్పు'లో నిలిచి తుదిజట్టులో ఉండేదెవరో..!

కరీబియన్‌ జట్టుతో టీ20 పోరు రసవత్తరంగా సాగింది. ఇక ఆ జట్టుతో వన్డే సమరం మొదలు కాబోతోంది. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్న కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. నిలకడగా ఆడలేకపోతున్న కేదార్‌ జాదవ్‌, రిషబ్‌ పంత్‌, మనీష్‌ పాండే.. కొత్తగా చోటు కోసం పోటీ పడుతున్న శివమ్‌ దూబె, మయాంక్‌ అగర్వాల్‌లకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. లభించే అవకాశాల్ని వీరిలో ఎవరెలా ఉపయోగించుకుంటారో చూడాలి.

మయాంక్‌ ఉంటాడా?

ఫార్మాట్‌ ఏదైనా కొత్తగా జట్టులోకి వచ్చే ఆటగాళ్లను నేరుగా తుది జట్టులోకి తీసుకోకపోవడం టీమ్‌ఇండియా సంప్రదాయం. ఒకట్రెండు సిరీస్‌లో జట్టుతో పాటే ఉంచి ఆ తర్వాత అవకాశం ఇస్తుంటుంది జట్టు యాజమాన్యం. ఎప్పుడో ఒకసారి కొందరు ఆటగాళ్లు జట్టులోకి రావడంతోనే తుది జట్టులోనూ అవకాశం దక్కించుకుంటారు. మరి మయాంక్‌ అగర్వాల్‌ సంగతేంటో చూడాలి. రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయపడటంతో అనుకోకుండా మయాంక్‌కు వన్డే జట్టులో చోటు లభించింది. అతను ఇప్పటికే టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వన్డేల్లో అవకాశం కోసం చూస్తుండగా.. ధావన్‌ గాయం వరంలా కలిసొచ్చింది. స్పెషలిస్టు ఓపెనర్‌ కావడం, ఫామ్‌లో ఉండటంతో మయాంక్‌కు కలిసొచ్చే అంశం. అయితే ప్రపంచకప్‌ మధ్యలో ధావన్‌ గాయపడటంతో రాహుల్‌ ఓపెనర్‌గా ఆడి సత్తా చాటాడు. ఇటీవల టీ20 సిరీస్‌లోనూ అతను ఓపెనర్‌గా రాణించాడు. కాకపోతే రాహుల్‌కు 3, 4 స్థానాల్లోనూ ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మయాంక్‌ను తుది జట్టులోకి తీసుకుంటే ఓపెనర్‌గా ఆడించి, రాహుల్‌ను దిగువకు పంపుతారా.. లేక రాహుల్‌నే రోహిత్‌కు జోడీగా పంపి, మయాంక్‌ను వేరే స్థానంలో ఆడిస్తారా అన్నది చూడాలి. మయాంక్‌ను పక్కన పెట్టి అలవాటైన కూర్పుతోనే కోహ్లి ముందుకు వెళ్లే అవకాశాలూ లేకపోలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్లో మూడో స్థానం కోహ్లీది కాగా.. నాలుగులో శ్రేయస్‌ అయ్యర్‌నే కొనసాగించే అవకాశముంది. అయ్యర్‌ నుంచి జట్టు మరింత నిలకడ ఆశిస్తోంది.

మయాంక్

పంత్‌.. ఈసారి విఫలమైతే!

ఈ మధ్య కాలంలో నిలకడ లేమితో, తప్పిదాలతో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు రిషబ్‌ పంత్‌. కెరీర్‌ ఆరంభంలో మెరుపులతో ధోని వారసుడిగా గుర్తింపు పొందిన ఈ కుర్రాడు.. తర్వాత అవసరం లేని దూకుడుతో వికెట్‌ పారేసుకుంటూ, వికెట్‌ కీపింగ్‌లో తరచుగా తప్పిదాలు చేస్తూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇటీవల టీ20 సిరీస్‌లోనూ అతను పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు. సంజు శాంసన్‌ను పక్కన పెట్టి మరీ అతడికి అన్ని మ్యాచ్‌ల్లోనూ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న విమర్శ ఉంది. అయితే వన్డే సిరీస్‌ జట్టులో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఇంకో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ లేడు. కాబట్టి మూడు మ్యాచ్‌ల్లోనూ అతను ఆడతాడన్నమాటే. పంత్‌.. 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చు. అయితే ఈ సిరీస్‌లో పెద్ద ఇన్నింగ్స్‌ ఆడకుంటే మాత్రం పంత్‌ స్థానానికి ముప్పు తప్పదు.

రిషభ్ పంత్

కేదార్‌ ఉంటాడా?

ప్రతిభకు లోటు లేకపోయినా.. జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడంలో కేదార్‌ జాదవ్‌ విఫలమయ్యాడు. ఫిట్‌నెస్‌ ప్రమాణాల్ని అందుకోలేకపోవడమే అతడి వైఫల్యానికి ముఖ్య కారణం. తరచుగా గాయాల పాలవడం ద్వారా జట్టుకు దూరమవడం, మళ్లీ రావడంతో అతడి లయ దెబ్బ తింది. ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేశాడు. ఇక మళ్లీ జట్టులోకి రాడేమో అనుకుంటే.. మళ్లీ వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ ఫామ్‌ అందుకోలేకపోయాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తోనే వన్డేలకు తిరిగొచ్చాడు. ఒత్తిడిలో భారీ షాట్లు ఆడగల.. పార్ట్‌టైం స్పిన్‌తో ఉపయోగపడగల కేదార్‌ లాంటి ఆటగాడు జట్టుకు చాలా అవసరమే. కానీ అతను తన ప్రతిభకు న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు తుది జట్టులో అతడి చోటే ప్రశ్నార్థకంగా మారింది. అతడి బదులు మనీష్‌ పాండేను ఆడించే అవకాశాలు లేకపోలేదు. పాండే కూడా నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్న ఆటగాడే. మరి ఈ ఇద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటుంటుందో చూడాలి. వీరిలో అవకాశం దక్కించుకున్న ఆటగాడు 5 లేదా 6 స్థానంలో ఆడొచ్చు.

కేదార్ జాదవ్

అతను అరంగేట్రం చేస్తాడా?

హార్దిక్‌ పాండ్య గాయంతో కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావడంతో పేస్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న కుర్రాడు శివమ్‌ దూబె. విండీస్‌తో టీ20 సిరీస్‌లో అతను అవకాశాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. ఓ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. పిచ్‌ను బట్టి బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల అదనపు పేసర్‌ అవసరమనుకుంటే దూబెను ఆడించే అవకాశం లేకపోలేదు. జాదవ్‌, పాండేలను కాదని అతడికి తుది జట్టులో చోటివ్వొచ్చు.

శివమ్ దూబే

ఇదీ చదవండి: కోహ్లీ, సింధుకు ట్విట్టర్​ అభిమానుల నీరాజనం

ABOUT THE AUTHOR

...view details