టెస్టు సమరం ప్రతికూల ఫలితంతో మొదలైంది. కానీ పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుగా ఓడించేశారు. టీ20ల్లోనూ ప్రతిఘటన తప్పలేదు. అయినా మన జట్టు తలొంచలేదు. ఇప్పుడిక వన్డే పోరు మొదలు కాబోతోంది. అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్న ప్రత్యర్థి.. ఈ ఒక్క సిరీస్ అయినా గెలిచి స్వదేశం చేరాలని పట్టుదలతో ఉంది. మరి కోహ్లీసేన.. ఇంగ్లీష్ జట్టుకు ఆ అవకాశం ఇస్తుందా? లేక ముచ్చటగా మూడో ఫార్మాట్లోనూ జయకేతనం ఎగురవేస్తుందా?
టెస్టులు, టీ20ల్లో ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించిన టీమ్‌ఇండియా.. ఇక ఆ జట్టుతో వన్డే సమరానికి సిద్ధమైంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలో నేడు రెండు జట్లు మూడు మ్యాచ్ సిరీస్‌లో తలపడబోతున్నాయి. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను రెండు ఫార్మాట్లలో ఓడించడం కచ్చితంగా టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. కానీ వన్డే సిరీస్ గెలవాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే.
అంత వీజీ కాదు..
ఇంగ్లాండ్‌పై టెస్టు, టీ20 సిరీస్‌లు గెలిచినంత మాత్రాన వన్డేల్లో గెలిచేయడం తేలిక కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం. టీ20లతో పోలిస్తే ఈ ఫార్మాట్లో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కొంచెం భిన్నం. బట్లర్ మిడిలార్డర్లో వస్తే.. రాయ్‌తో కలిసి బెయిర్‌స్టో ఓపెనింగ్ చేస్తాడు. స్టోక్స్ మూడో స్థానంలో రానున్నాడు. వీరికి తోడు మోర్గాన్, బిల్లింగ్స్ కూడా ఉన్నారు. బుమ్రా లేని భారత బౌలింగ్ దళం ఈ బ్యాటింగ్ లైనప్‌నకు ఏమేర సవాలు విసురుతుందో చూడాలి.
టాస్ కీలకం
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో టాస్ గెలిచి మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తే స్కోరు 350 దాటినా ఆశ్చర్యం లేదు. పేసర్లు భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్.. ఏమేర ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేస్తారో చూడాలి. స్పిన్నర్లు చాహల్, కుల్‌దీప్, సుందర్‌ల్లో ఎవరు తుది జట్టులో ఉంటారో చెప్పలేం. భారత్ లాగే ఇంగ్లాండ్‌కు బౌలింగ్‌లో ఇబ్బందులున్నాయి. ఆర్చర్ గాయంతో దూరం కావడం పెద్ద ప్రతికూలత. వుడ్‌కు తోడు భారత్‌లో ఆడిన అనుభవం లేని టాప్లీ పేస్ కొత్త బంతిని పంచుకోనున్నారు. స్టోక్స్, కరన్ వారికి సహకరించనున్నారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్ రషీద్ భారత బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేస్తాడని ఇంగ్లాండ్ ఆశలు పెట్టుకుంది.
రాహుల్‌కు చోటుందా?
తొలి వన్డేలో రోహిత్‌తో కలిసి ధావనే ఓపెనింగ్ చేస్తాడని కోహ్లీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటుంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అతణ్ని పంత్ తర్వాత ఆరో స్థానంలో ఆడించడమా లేక తన బదులు స్పిన్ ఆల్‌రౌండర్లయిన కృనాల్ పాండ్యా లేదా వాషింగ్టన్ సుందర్‌ల్లో ఒకరిని ఎంచుకుంటారా అన్నది ఆసక్తికరం. రోహిత్, ధావన్, కోహ్లీల్లో ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. మొదట బ్యాటింగ్ చేస్తే 350 స్కోరు లక్ష్యంగా పెట్టుకోవాల్సిందే. 50 ఓవర్ల మ్యాచ్ కాబట్టి అయ్యర్, పంత్, పాండ్యా తమ బ్యాటింగ్ సత్తా చూపించడానికిది మంచి అవకాశమే.
పరుగుల వరదే..
పుణె పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నాలుగు వన్డేలు మాత్రమే జరగ్గా.. మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసి జట్టు 300 దాటింది. ఇరు జట్లూ బ్యాటింగ్‌లో భీకరంగా కనిపిస్తున్న నేపథ్యంలో మంగళవారం కూడా 300 పైచిలుకు స్కోరు నమోదవడం లాంఛనమే అని భావిస్తున్నారు. 2017లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇక్కడ వన్డే మ్యాచ్ ఆడగా.. భారత్ ఏకంగా 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.