తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాప్​-5: మ్యాచ్ గమనాన్నే మార్చేసిన ధోనీ నిర్ణయాలు

టీమ్​ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకు చేసిన సేవ అభిమానులు అంత తొందరగా మర్చిపోలేరు. జట్టు కష్ట సమయంలో అతడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మ్యాచ్ గమనాన్నే మార్చేశాయి అలా ధోనీ కెరీర్​లో తీసుకున్న టాప్​-5 డిసిషన్స్​ను ఓసారి చూద్దాం,.

dhoni
ధోనీ

By

Published : Jul 7, 2020, 5:08 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పుట్టినరోజు ఈరోజు. మైదానంలో ప్రశాంతంగా ఉండటం, ప్రత్యర్థులకు ధీటైన వ్యూహాలు రచించడం, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టటం ఇలా చాలా విషయాల్లో మహీ నేర్పరి. అందుకే ఏ భారత కెప్టెన్​కు సాధ్యం కానీ కొన్ని రికార్డులు ధోనీ పేరిట ఉన్నాయి. ఐసీసీ ఈవెంట్లలో భారత్​ను విశ్వవిజేతగా నిలిపిన ఘనుడు ధోనీ. ఈరోజు ఇతడి పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్​లో తీసుకున్న ఐదు అత్యుత్తమ నిర్ణయాలను ఓసారి గుర్తు చేసుకుందాం.

2007 టీ20 ప్రపంచకప్​ ఫైనల్: జోగీందర్​కు చివరి ఓవర్ అప్పగించడం

టీ20 ఫార్మాట్​లో తొలి ప్రపంచకప్​ 2007లో జరిగింది. టీ20ల గురించి భారత్​కు అప్పటికీ అంతగా పరిచయం లేదు. అయినా తొలి ఎడిషన్​లోనే విజేతగా నిలిచి అందిరికీ షాకిచ్చింది ధోనీసేన. ఈ టోర్నీలో పాకిస్థాన్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్​లో ధోనీ చివర్లో తీసుకున్న నిర్ణయం భారత జట్టును విశ్వవిజేతగా నిలిపింది. మీడియం పేసర్​ జోగీందర్ శర్మకు అనూహ్యంగా చివరి ఓవర్ ఇచ్చాడు మహీ. పాకిస్థాన్​ అప్పటికి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. కానీ మిడిలార్డర్ బ్యాట్స్​మెన్​ మిస్బావుల్ హక్​ క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లో హర్భజన్ బౌలింగ్​లో మూడు సిక్సులు బాది మంచి ఫామ్​లో కనిపించాడు. దీంతో అందరూ మహీ తీసుకున్న నిర్ణయం తప్పనుకున్నారు. కానీ అదే డిసిషన్​ భారత్​కు విజయాన్నందించింది.

టీమ్​ఇండియా

భారత్​-ఆస్ట్రేలియా చివరి టెస్టు, నాగ్​పుర్: నెగటివ్ బౌలింగ్

2008లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో చివరి మ్యాచ్​ వచ్చేసరికి భారత్​ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి, మూడో టెస్టు డ్రా కాగా, రెండో టెస్టులో ధోనీసేన విజయం సాధించింది. చివరిదైన నాలుగో టెస్టు నాగ్​పుర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో భారత్ 441 పరుగులు చేయగా.. రెండో రోజు ముగిసే సరికి ఆసీస్​ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి జోరు మీద కనిపించింది. కానీ మూడో రోజు ధోనీ బౌలర్లకు ఇచ్చిన ఓ సలహా మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. బంతులను ఆఫ్​ స్టంప్​ అవతల వేయాల్సిందింగా బౌలర్లకు సూచించాడు మహీ. ఈ నిర్ణయాన్ని కామెంటేటర్స్​తో పాటు పలువురు మాజీలు తప్పుబట్టారు. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్ధమంటూ విమర్శించారు. కానీ ఈ డిసిషన్​ వల్ల మూడో రోజు కంగారూ జట్టు 85.4 ఓవర్లు ఆడి 166 పరుగులు మాత్రమే చేయలగలిగింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్​లో 355 పరుగులకు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్​లో సెహ్వాగ్ (92) విధ్వంసకర ఇన్నింగ్స్​కు తోడు ధోనీ ధనాధన్ సెంచరీతో ఆసీస్​ ముందు 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది భారత్. అయితే ఆసీస్​ 172 పరుగులకే పరిమితమైంది. దీంతో సిరీస్​ 2-0 తేడాతో చేజిక్కించుకుంది ధోనీసేన.

ధోనీ

2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: ఇషాంత్​పై నమ్మకం ఉంచడం

ఈ మెగాటోర్నీలో భారత్​-ఇంగ్లాండ్ ఫైనల్​ మ్యాచ్​లో తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్​ను 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ధోనీసేన 129 పరుగులకే పరిమితమైంది. 130 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ చివర్లో 18 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. అయితే 18 ఓవర్ కోసం ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్​లు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందులో ఇషాంత్ అప్పటికే మూడు ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ ఇషాంత్​పై నమ్మకముంచిన మహీ అతడికి బౌలింగ్ ఇచ్చాడు. ధోనీ నమ్మకాన్ని నిలబెట్టిన జంబో ఒకే ఓవర్లో ప్రమాదకరంగా మారతున్న ఇయాన్ మోర్గాన్, రవి బొపారాలను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇండియా ఐదు పరుగుల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది.

ఇషాంత్, ధోనీ

భారత్-బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ 2016: వికెట్ కీపర్ గ్లోవ్​ వదిలేయడం

2016 టీ20 ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్​ పరాజయం అంచుకు వెళ్లి ఊపిరిపీల్చుకుంది. చివర్లో బంగ్లా జట్టు మూడు బంతుల్లో రెండు పరగులు చేయాల్సి ఉండగా ధోనీ చాకచక్యంతో విజయం సాధించింది టీమ్​ఇండియా. చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య వరుస బంతుల్లో రహీమ్, మహ్మదుల్లాను పెవిలియన్ చేర్చాడు. టెయిలెండర్ శువంగత క్రీజులోకి వచ్చాడు. అప్పటికి బంగ్లా చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్​కు షార్ట్ బంతి వేయాలని సూచించిన దోనీ గ్లోవ్​ విడిచి కీపింగ్ చేశాడు. ఒకవేళ బ్యాట్స్​మన్​ బంతిని ఆడటంలో విఫలమై పరుగుకు ప్రయత్నిస్తే రనౌట్ చేయొచ్చని అతడి ఆలోచన. అదే ఫలితాన్నిచ్చింది. శువంగత బంతిని మిస్సవ్వగా అది నేరుగా మహీ చేతిలో పడింది. బ్యాట్స్​మెన్ పరుగు పూర్తి చేసే లోపే వికెట్లను గిరాటేసిన ధోనీ జట్టుకు విజయాన్నందించాడు.

ధోనీ

2011 ప్రపంచకప్ ఫైనల్: తన బ్యాటింగ్​ పొజిషన్ మార్చడం

ఈ ప్రపంచకప్​ ఫైనల్ ముంబయి వేదికగా శ్రీలంకతో జరిగింది. ఈ మ్యాచ్​లో లంక జట్టు టీమ్​ఇండియా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ భారత్​ ఆదిలోనే సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్​ లాంటి కీలక వికెట్లు కోల్పోయింది. 22 ఓవర్ పూర్తయ్యే సరికి 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అయితే ఐదో వికెట్​గా ఫామ్​లో ఉన్న యువరాజ్​ సింగ్​ను కాదని తానే బరిలోకి దిగాడు ధోనీ. అప్పటికే ఈ టోర్నీలో 90.50 సగటుతో 362 పరుగులు చేసి మంచి జోరుమీదున్నాడు యువీ. కానీ ధోనీ మాత్రం ఈ టోర్నీలో అంత టచ్​లో కనిపించలేదు. ఫలితంగా ఈ నిర్ణయాన్ని చాలామది తప్పుబట్టారు. కానీ ఇదే డిసిషన్​ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసి మహీని హీరోను చేసింది. ధోనీ ఈ మ్యాచ్​లో 79 బంతుల్లో 91 పరుగుల కీలక ఇన్నింగ్స్​తో జట్టును గెలుపు బాట పట్టించాడు. చివర్లో విజయం కోసం మహీ కొట్టిన ఆ సిక్స్​ ఇప్పటికీ అభిమానుల కళ్లలో మెదులుతూనే ఉంటుంది.

ధోనీ

ABOUT THE AUTHOR

...view details