తెలంగాణ

telangana

ETV Bharat / sports

షెఫాలీ.. ప్రపంచకప్​ ముందు తండ్రికి ఏం మాటిచ్చింది? - Shafali Verma latest news

వయసేమో 16.. బ్యాట్​ పడితే సిక్సర్లు హోరు. విధ్వంసకర ఆటతీరుకు మారుపేరు.. ప్రపంచకప్​లో భారత్​ను నడిపిస్తోంది ఆమె జోరు. ఇలా చెప్తే భారత మహిళా క్రికెటర్​ షెఫాలీ గురించి మాటలు చాలవు. ఎందుకంటే ఓ అంతర్జాతీయ జట్టు తరఫున ఆడుతూ, కేవలం 18 మ్యాచ్​ల్లోనే ప్రపంచ నంబర్​ వన్​ ర్యాంక్​ అందుకుంది. అందుకే ఈ చిన్నది ప్రస్తుతం భారత్​కు ఓ ఆశాకిరణం.. మరి అలాంటి రాక్​స్టార్​ను దేశానికి అందించడంలో తన తండ్రి సంజీవ్​ పాత్ర ఏంటి? ఓ లుక్కేద్దాం.

T20 World Cup 2020
షెఫాలీ సిక్సర్ల వెనకున్న ఎమోషన్‌ 'నాన్న'

By

Published : Mar 6, 2020, 12:49 PM IST

అరంగేట్రం చేసిన ఆరు నెలలకే ప్రపంచ నంబర్​వన్‌గా అవతరించింది. చిన్న వయసులోనే విదేశీ గడ్డపై భారత్ తరఫున​ సత్తా చాటుతోంది. ఇప్పుడు జట్టుకు తొలిసారి ప్రపంచకప్​ అందించేందుకు సిద్ధమవుతోంది. ఆమెనే ఓపెనర్​ రాణిస్తున్న 16 ఏళ్ల షెఫాలీ వర్మ. తనను తీర్చిదిద్దిన నాన్నే తన ఎమోషన్‌ అంటోంది. అందుకే వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. పగలు, రాత్రి శ్రమించిన తండ్రిని గర్వపడేలా చేస్తానంటోంది. ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు ఆయనకో మాటిచ్చింది. అదేంటో తెలుసా?

సహచరులతో షెఫాలీ

సెహ్వాగ్​ను పోలిన హిట్టర్​

అంతర్జాతీయ క్రికెట్లో షెఫాలీ వర్మను ఫీమేల్‌ వీరూ వెర్షన్‌గా భావిస్తారు. ఎప్పుడెప్పుడు బంతివేస్తారా అని క్రీజులో ఆమె నిల్చొనే తీరు, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టించే భారీ షాట్లు, పెవిలియన్‌ చేరేందుకు భయపడని మనస్తత్వం అన్నీ అతడిలాగే ఉంటాయి. అందుకే ఆమె ఆటే ప్రస్తుతం భారత్​ బ్యాటింగ్​కు ఓ బలం.

వీరు తీరులో షెఫాలీ

జట్టుకు ఓ ధైర్యం?

ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడానికి కారణం నలుగురు బౌలర్లు. మరి స్మృతి, హర్మన్‌, వేద విఫలమైనా ఆ మాత్రం లక్ష్యాలను జట్టు నిర్దేశించిందంటే కారణం షెఫాలీ వర్మ. 29 (15 బంతుల్లో), 39 (17), 46 (34), 47 (34) ఇవీ ఈ టోర్నీలో ఆమె చేసిన పరుగులు. శ్రీలంకపై రనౌట్‌ కాకపోయింటే ఆమె అసలైన విధ్వంస స్వరూపం సాక్షాత్కారం అయ్యేది. లీగ్ మ్యాచ్‌ పవర్‌ప్లేలో భారత్‌ 8.25 రన్‌రేట్‌తో 198 పరుగులు చేసిందే ఆమె వల్లే.

షెఫాలీ వర్మ

మహిళల్లో అరంగేట్రం చేసిన ఆరు నెలల్లో ఎవరైనా ప్రపంచ నంబర్‌వన్‌ కావడం చూశామా? అందుకే సోషల్‌ మీడియాలో షెఫాలీని ఘటోత్కచుడు పూనిన శశిరేఖతో పోలుస్తున్నారు. కెరీర్‌లో 18 మ్యాచులాడి 146.96 స్ట్రైక్‌రేట్‌తో 485 పరుగులు షెఫాలీ అసలు వెలుగులోకి రావడానికి కారణం ఆమె తండ్రి సంజీవ్‌.

మాటలకు ఆటతో సమాధానం

స్వతహాగా క్రికెట్‌ అభిమాని అయిన సంజీవ్‌.. తన కుమారుడు సాహిల్‌తో పాటు కుమార్తెకు క్రికెట్లో ఓనమాలు దిద్దించాడు. తరచూ క్రికెట్‌ మ్యాచులకు తీసుకెళ్లేవాడు. అలా సచిన్‌కున్న క్రేజ్‌, ఆమె మనసులో స్థిరపడిపోయింది. సాహిల్‌ బ్యాటింగ్‌, లెగ్‌స్పిన్‌ సాధన చేస్తుంటే ఆరేళ్ల వయసున్న షెఫాలీ.. అతడికి బంతులు అందించేంది. అప్పుడే ఆమెకు బ్యాటింగ్‌ చేయడం నేర్పించాడు సంజీవ్‌. అది ఆమెకు సరదాగా అనిపించేంది. తొమ్మిదేళ్ల వయసులో షెఫాలీని అకాడమీలో చేర్పించేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే బాలికలకు అప్పుడు శిక్షణ లేదు. హరియాణాలో ఎక్కడ చూసినా కట్టుబాట్లే. అయినప్పటికీ బాలుడిలా తయారు చేసి అకాడమీకి పంపించాడు.

షెఫాలీ తండ్రి సంజీవ్​

బ్యాటు, బంతి పట్టించి ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నావని బంధువులు, స్నేహితులు సూటిపోటీ మాటలతో సంజీవ్​పై దాడి చేసేవారు. వారందరి దృక్పథాన్ని తిరస్కరిస్తూనే, కూతురి వెన్నంటి నిలిచాడు. ఏనాటికైనా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని షెఫాలీ గురించి కలగన్నాడు ఆ తండ్రి.

అబ్బాయి వేషంలోనూ అదరహో

అండర్‌-12 పోటీల్లో సాహిల్‌ పోటీపడాల్సి ఉండగా అతడికి జ్వరం వచ్చింది. బదులుగా బాలుడి వేషధారణలో ఉన్న షెఫాలీని అతడు పానిపత్‌కు పంపించాడు. ఆమె అద్భుతమైన షాట్లతో 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్' గెలవడం విశేషం. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తనలోని ఆటను పూర్తిగా బయటపెట్టింది.

షెఫాలీ వర్మ

2013 నుంచి హరియాణాకు ఆడటం మొదలుపెట్టింది. అందుకోసం సంజీవ్‌.. ఉదయం, సాయంత్రం, రాత్రి ఎంతో శ్రమించేవాడు. తన పనితో పాటు అమ్మాయి ఆట కోసం సమయం వెచ్చించేవాడు. అతడి ఆశయాన్ని అర్థంచేసుకున్న షెఫాలీ అండర్‌-16, 19, 23 పోటీల్లో విజృంభించి ఆడేది.

2018-19లో నాగాలాండ్‌పై 56 బంతుల్లో 128 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. గతేడాది మహిళల టీ20 ఛాలెంజ్‌లో చోటు దక్కించుకుంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లోనే ఆమె ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ డేనియెల్‌ వ్యాట్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పింది. ఆమెకు 15 ఏళ్లే అని తెలియగానే మ్యాచ్‌ తర్వాత వ్యాట్‌ అవాక్కయింది.

ట్రాక్టర్‌ టైర్లతో ప్రాక్టీస్​

షెఫాలీ నిర్భయంగా క్రికెట్‌ ఆడేందుకు తండ్రి సంజీవ్‌ ఎంతో ప్రోత్సహించాడు. ఆమె భుజబలం పెరిగేందుకు, అప్పర్‌ బాడీ దృఢంగా మారేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టించాడు. వారి ఇంటి సమీపంలోనే పోలీసు శిక్షణ మైదానం ఏర్పాటు చేయడం వల్ల అతడికో అవకాశం వచ్చింది. అక్కడ ట్రాక్టర్‌ టైర్‌ను సెషన్‌కు 20 సార్లు ఫ్లిప్‌ చేయించేవాడు. పెద్ద బంతితో నడుము ఫ్లెక్సిబుల్‌గా మారేందుకు కసరత్తులు చేయించాడు. మైదానం చుట్టూ పరుగెత్తించేవాడు. ఫలితంగా ఆమె బలం అసాధారణంగా పెరిగింది. బౌలర్‌ తలపై నుంచి అలవోకగా సిక్సర్లు బాదేందుకు ఉపయోగపడింది. పైగా ఒక్కో బౌండరీ బాదేకొద్దీ షెఫాలీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందట.

ప్రాక్టీస్​లో షెఫాలీ

నాన్నకు చిన్నమాట

ఒకప్పుడు తన తండ్రిని విమర్శించిన వారితోనే ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించేలా చేసింది షెఫాలీ. బంధువులు, పెద్దలు, స్నేహితులు ఇప్పుడతన్ని తెగ పొగిడేస్తున్నారు. ఉద్యానవనంలో ఉదయపు నడకకు వెళ్లిన సంజీవ్‌ను ఆపి " ఏంటి సంజీవ్‌జీ. మీ అమ్మాయి మాతో మహిళల క్రికెట్‌ను చూడక తప్పని పరిస్థితి తీసుకొస్తోంది" అని అంటున్నారట.

బ్యాట్​తో రాణిస్తోన్న షెఫాలీ

మెగాటోర్నీకి బయల్దేరే ముందు సంజీవ్‌కు కుమార్తె ఓ మాటిచ్చింది. " నాన్నా కనీసం ఒక్క సెంచరీ అయినా చేస్తాను. నిన్ను గర్వపడేలా చేస్తాను" అని చెప్పింది. ప్రపంచకప్‌ లీగుల్లో రెండు సార్లు ఆమె అర్ధశతకాన్ని త్రుటిలో చేజార్చుకుంది. టీమిండియా ఆదివారం మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ ఆడబోతోంది. అందులో షెఫాలీనే ఫేవరెట్‌. ఆమె ఆటను చూసేందుకు సంజీవ్‌ ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. మరి ప్రపంచ ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ స్టాండ్స్‌లో తండ్రి చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తుండగా షెఫాలీ సెంచరీ చేస్తుందా? తన మాట నిలబెట్టుకుందేమో చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details