బయోబబుల్‌లో ఉంటూ క్రికెట్ ఆడటం వల్ల కుటుంబాన్ని ఎంతో మిస్సవుతున్నట్లు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. గత ఆరు నెలలు ఎంతో కఠినంగా గడిచాయని, అయితే ప్రస్తుతం రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లపై దృష్టిసారిస్తున్నాని తెలిపాడు.
"‘బయోబబుల్‌లో ఉండటం ఎంతో కష్టం. కుటుంబానికి దూరంగా ఉంటూ బుడగలో ఉన్న ఆరు నెలలు ఎంతో కఠినంగా గడిచాయి. ప్రతివ్యక్తికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. వచ్చే 12 నెలలను చూస్తే మరింత క్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటికి ఎప్పుడొస్తామో, కుటుంబంతో ఎంతసేపు కలిసి ఉంటామో తెలియదు. కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నాం. కాగా, 14 రోజులు క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ హోటల్‌లో ఉండి, ముగ్గురు పిల్లలు, భార్యను కలవకపోవడం చాలా బాధగా ఉంది. ఇంట్లోనే 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితిని మా కుటుంబానికి కలిగించను" అని వార్నర్ అన్నాడు.